Telugu Global
National

పతంజలి పేరు వాడొద్దు.. బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ వార్నింగ్

యోగా పితామహుడిగా భావించే మహర్షి పతంజలి పేరును తమ వ్యాపారాలకు వాడుకుంటూ పెద్ద సామ్రాజ్యాన్ని రామ్‌దేవ్ నిర్మించుకున్నారని.. కానీ పతంజలి పుట్టిన ఊరికి మాత్రం ఏమీ చేయలేదని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విమర్శించారు.

పతంజలి పేరు వాడొద్దు.. బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ వార్నింగ్
X

ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ ఒకరు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రామ్‌దేవ్ చాలా కాలంగా 'పతంజలి' బ్రాండ్ నేమ్‌తో ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నారు. ఆయుర్వేద ఔషధాలతో పాటు ఇటీవల మసాలా దినుసులు, ఇన్‌స్టంట్ ఫుడ్, బట్టల వ్యాపారంలోకి కూడా ఆయన అడుగు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పతంజలి ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నది. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్ షోరూంలు కూడా పతంజలి సంస్థకు ఉన్నాయి. బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా బాబా రామ్‌దేవ్‌కు పేరుంది.

కాగా, యోగా పితామహుడిగా భావించే మహర్షి పతంజలి పేరును తమ వ్యాపారాలకు వాడుకుంటూ పెద్ద సామ్రాజ్యాన్ని రామ్‌దేవ్ నిర్మించుకున్నారని.. కానీ పతంజలి పుట్టిన ఊరికి మాత్రం ఏమీ చేయలేదని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విమర్శించారు. రామ్‌దేవ్‌తో పాటు పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్‌కు ఆ పేరును వాడటం మానేయాలని బ్రిజ్ భూషణ్ వార్నింగ్ ఇచ్చారు. యూపీలోని గోండా జిల్లా కొండార్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహర్షి పతంజలి పేరును వాడుతూ వాళ్లిద్దరూ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వాళ్లు ఏం వ్యాపారం చేస్తారో నాకు అనవసరం. మొదట ఆయుర్వేదం పేరుతో వ్యాపారం మొదలు పెట్టి ఇప్పుడు నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, లోదుస్తులకు కూడా పతంజలి పేరు వాడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. వారికి ఆ పేరు వాడుకునే హక్కు ఎవరిచ్చారని అన్నారు.

అయోధ్యకు వచ్చే యాత్రికులు దగ్గరలోనే ఉన్న కొండార్ గ్రామాన్ని సందర్శించాలని, పతంజలి పుట్టిన ఊరు ఎలా ఉందో.. ఆయన పేరు ఉన్న నెయ్యి తింటున్న వాళ్లు చూడాలని కోరారు. ఆ ఇద్దరు బడా వ్యాపారులు కొండార్ గ్రామానికి చేసింది ఏమీ లేదని.. కానీ కోట్లాది రూపాయలు మాత్రం వెనకేసుకుంటున్నారని విమర్శించారు. వెంటనే పతంజలి పేరు వాడటం మానేయకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుదని హెచ్చరించారు. యూపీలోని కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి బ్రిజ్ భూషణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

First Published:  25 Nov 2022 12:37 AM GMT
Next Story