Telugu Global
National

మహిళలకు క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా

రాందేవ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.

మహిళలకు క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా
X

మహిళలు దుస్తులు ధరించకపోయినా బాగుంటారని ఇటీవల యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ముఖ్యంగా మహిళలు రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగా గురువు అయి ఉండి అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మహిళా లోకం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా రాందేవ్ బాబా చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా స్పందించారు. మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని కోరారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశిస్తూ రాందేవ్ బాబా మాట్లాడుతూ మహిళలు దుస్తులు వేసుకోకపోయినా తన కళ్ళకు బాగుంటారని నోరు జారారు. రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.

దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్ తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరుతూ ఒక లేఖ రాసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'మహిళలను అగౌరవ పరచాలన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదు. అయినా నేను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే చింతిస్తున్నా. వారికి భేషరుతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా' అని రాందేవ్ బాబా లేఖలో పేర్కొన్నట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు.

First Published:  28 Nov 2022 1:20 PM IST
Next Story