Telugu Global
National

మరో పది రోజుల్లో కొత్త పార్టీ.. ఆజాద్ సంచలన ప్రకటన

బారాముల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో కొత్త పార్టీ ఏర్పాటుపై ఉన్న సస్పెన్స్‌కు గులాం నబీ ఆజాద్ తెరదించారు.

మరో పది రోజుల్లో కొత్త పార్టీ.. ఆజాద్ సంచలన ప్రకటన
X

కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం ఆజాద్ రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆయన ప్రధాని మోడీ, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వారి ప్రోద్బలంతోనే కాంగ్రెస్‌ను వీడారన్న విమర్శలు వచ్చాయి. ఆయన భవిష్యత్‌లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు భావించారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన కొత్త పార్టీ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు గులాంనబీ ఆజాద్ తెలిపారు.

బారాముల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో కొత్త పార్టీ ఏర్పాటుపై ఉన్న సస్పెన్స్‌కు తెరదించారు. ఈ సందర్భంగా గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు కలిశారు. అప్పుడు జాతీయ పార్టీ పెట్టాలా? రాష్ట్ర పార్టీ పెట్టాలా? అనే అంశంపై కొంత వరకు కన్‌ఫ్యూజన్ ఉండేది. అందుకే పార్టీ గురించిన అంశాలను బహిర్గతం చేయలేకపోయాను. మరో పది రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తాం. అయితే అది జాతీయ పార్టీగా ప్రకటించలేకపోవచ్చు. జాతీయ పార్టీగా ప్రారంభించాలంటే ఇతర సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపాలి. దానికి చాలా సమయం పడుతుంది. జమ్ముకశ్మీర్‌లోనే 90 శాతం మంది ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారు. జాతీయ పార్టీని ప్రారంభిస్తామన్నా ప్రజల మద్దతు దొరుకుతుంది.' అని పేర్కొన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఆజాద్ సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లోని 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 400 మంది ప్రజాప్రతినిధులను తాను కలిసినట్లు, వారంతా తనకు మద్దతు తెలిపినట్లు ఆజాద్ పేర్కొన్నారు. ప్రత్యేక పార్టీ తర్వాత జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరణ, భూమి హక్కు, ఉపాధి హక్కు కల్పన కోసం కృషి చేస్తామని పలు సందర్భాల్లో ఆజాద్ తెలిపారు.

First Published:  11 Sept 2022 8:17 PM IST
Next Story