Telugu Global
National

అయ్యప్ప ప్రసాద విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేత

బుధవారం సాయంత్రం నుంచి ప్రసాదాల విక్రయాన్ని నిలిపివేశారు. యాలకులు వాడకుండా తయారుచేసిన ప్రసాదం పంపిణీ గురువారం నుంచి మొదలవుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ కే.అనంత గోపాల్ ప్రకటించారు.

అయ్యప్ప ప్రసాద విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేత
X

శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అరవణి పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. కేరళ హైకోర్టు ఆదేశాలతో ప్రసాద విక్రయాలను ఆలయ బోర్డ్ నిలిపివేసింది. అరవణి ప్రసాదంలో వాడే యాలకుల్లో మోతాదుకు మించి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ నివేదిక ఆధారంగా హైకోర్టు ప్రసాదాల విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది.

యాలకులు వాడకుండా ప్రసాదం తయారుచేసి దాన్ని భక్తులకు అందజేసేందుకు హైకోర్టు అనుమతించింది. బుధవారం సాయంత్రం నుంచి ప్రసాదాల విక్రయాన్ని నిలిపివేశారు. యాలకులు వాడకుండా తయారుచేసిన ప్రసాదం పంపిణీ గురువారం నుంచి మొదలవుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ కే.అనంత గోపాల్ ప్రకటించారు. యాలకులు లేకుండా ప్రసాదం తయారీని బుధవారం రాత్రి నుంచి మొదలుపెట్టారు.

ట్రావెన్ కోర్ దేవస్థానం రోజు 2.4 లక్షల అరవణి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటుంది. త్వరలోనే ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన యాలకుల్ని సేకరించి యాలకులు కలిపిన ప్రసాదం విక్రయిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. అప్పటివరకు యాలకులు లేకుండానే ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇదివరకే తయారు చేసిన 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఆలయ బోర్డ్ పక్కన పెట్టింది.

First Published:  12 Jan 2023 9:35 AM IST
Next Story