Telugu Global
National

యూపీఎస్సీ ఫ‌లితాల్లో బిగ్ మిస్టేక్‌..!

యూపీఎస్సీ ఇటీవ‌ల వెల్లడించిన ఫలితాల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల అయేషా ఫాతిమా, 26 ఏళ్ల అయేషా మక్రాని ఇద్దరూ 184వ ర్యాంకు సాధించారు. వారిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటే. ఇక్కడే చిక్కొచ్చిపడింది.

యూపీఎస్సీ ఫ‌లితాల్లో బిగ్ మిస్టేక్‌..!
X

యూపీఎస్సీ పరీక్షకు దేశంలోనే అత్యంత పోటీ ఉంటుంది. ప్ర‌తి ఏడాదీ దాదాపు 800 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేస్తుంటుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌ల కోసం ల‌క్ష‌లాదిమంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసి.. పోటీ ప‌డుతుంటారు. త‌మ భ‌విష్య‌త్తుకు బంగారు బాట వేసుకోవాల‌ని ప‌రిత‌పిస్తుంటారు. మూడు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) పరీక్షలు నిర్వహించి అభ్యర్థిని ఎంపిక చేసే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది సమయం పడుతుంది.

ఇంత సుదీర్ఘ ప్ర‌క్రియ‌లో ఏదైనా మిస్టేక్ జ‌రిగితే.. అభ్య‌ర్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతారు. 2022 ప‌రీక్ష‌ల‌కు చెందిన ఫ‌లితాలు ఇటీవ‌లే విడుద‌ల చేసిన యూపీఎస్సీ.. ఇందులో బిగ్ మిస్టేక్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు మహిళా అభ్యర్థులు ఇప్పుడు దీనివ‌ల్ల నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నారు.

యూపీఎస్సీ ఇటీవ‌ల వెల్లడించిన ఫలితాల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల అయేషా ఫాతిమా, 26 ఏళ్ల అయేషా మక్రాని ఇద్దరూ 184వ ర్యాంకు సాధించారు. వారిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటే. ఇక్కడే చిక్కొచ్చిపడింది. వాళ్లిద్దరూ నిజమైన ర్యాంకర్ నేనంటే నేనంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఎక్కడో పొరపాటు జరిగిందని తమకు న్యాయం చేయాలని ఇద్దరూ యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.

యూపీఎస్సీ ఏం చెబుతోందంటే...

అభ్య‌ర్థులిద్ద‌రి అడ్మిట్ కార్డుల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే కొన్ని తేడాలు క‌నిపిస్తున్నాయ‌ని యూపీఎస్సీ అధికారులు వెల్ల‌డించారు. పర్సనాలిటీ టెస్టు (ఇంటర్వ్యూ) నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింద‌ని చెప్పారు. వీరిద్దరికీ ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. మాక్రానీ అడ్మిట్ కార్డులో గురువారం అని, ఫాతిమా కార్డులో మంగళవారం అని రాసి ఉంది. క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్ కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతో పాటు, క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మాక్రానీ అడ్మిట్ కార్డుపై అవేం కనిపించడం లేదు. మరోవైపు యూపీఎస్సీ అధికారులు కూడా ఫాతిమానే అసలు అభ్యర్థి అని చెబుతున్నారు. అలాగని మక్రానీని కూడా తప్పుబట్టలేమని, పొరపాటు ఎక్కడ జరిగిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు.

First Published:  26 May 2023 7:40 AM IST
Next Story