కేరళలో ఏవీఎన్ వైరస్ డేంజర్ బెల్స్..! - 20,471 బాతులను చంపేయాలని ప్రభుత్వ నిర్ణయం
వైరస్ వ్యవహారం వెలుగు చూడటంతో కేరళ సర్కారు వెంటనే రక్షణ చర్యలకు దిగింది. ఆ ఫారమ్‌ల పరిధిలోని ఒక కిలోమీటరు వరకు ఉన్న బాతులను చంపేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 10 మందితో కూడిన 8 ర్యాపిడ్ బృందాలు మొత్తం 20,471 బాతులను చంపేశాయి.
ప్రపంచాన్నే కుదిపేసిన కోవిడ్ వైరస్ సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో మరో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో తొలిసారి కేరళలోనే కోవిడ్ వైరస్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు కొత్త వైరస్ కూడా కేరళలోనే కలకలం రేపుతోంది. అయితే ఈసారి మనుషులపై కాకుండా పక్షి జాతిపై ఈ వైరస్ పంజా విసురుతోంది.
ఏవీఎన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేరళలో వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో అలప్పుజ జిల్లా హరిబాగ్ మున్సిపాలిటీలోని బాతుల ఫారమ్‌లో వారం రోజుల వ్యవధిలో వందలాది బాతులు అకస్మాత్తుగా మృతిచెందాయి. అనుమానంతో అధికారులు చనిపోయిన బాతుల రక్త నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపించారు. వాటిని పరిశీలించిన అక్కడి శాస్త్రవేత్తలు వాటికి ఏవీఎన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకినట్టు నిర్దారించారు.
వైరస్ వ్యవహారం వెలుగు చూడటంతో కేరళ సర్కారు వెంటనే రక్షణ చర్యలకు దిగింది. ఆ ఫారమ్‌ల పరిధిలోని ఒక కిలోమీటరు వరకు ఉన్న బాతులను చంపేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 10 మందితో కూడిన 8 ర్యాపిడ్ బృందాలు మొత్తం 20,471 బాతులను చంపేశాయి.
ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఒక కిలోమీటరు పరిధిలోని పక్షుల రవాణా జరగకుండా నిషేధం విధిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోని బాతు, కోడి, గుడ్డు, మాంసం విక్రయాలపై జిల్లా కలెక్టర్ నిషేధం విధించారు. మరోవైపు పక్షుల నుంచి మనుషులకూ ఈ అంటువ్యాధి వ్యాపించే ప్రమాదముండటంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
గతేడాది ఓ 11 ఏళ్ల బాలుడు ఏవీఎన్ ఫ్లూ ప్రభావంతో మృతిచెందాడు. ఢిల్లీలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వ్యాపిస్తున్న ఏవీఎన్ ఫ్లూ ని.. బర్డ్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది పక్షులలో ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షులతో ఉన్న మనుషులకు కూడా ఇది వ్యాపించే ప్రమాదముంది. ఇది నేరుగా మనుషులపై ప్రభావం చూపనప్పటికీ.. ఈ వ్యాధి సోకిన మనుషుల నుంచి వ్యాపించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ విషయంలో దృష్టి పెట్టింది. ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని కేరళకు పంపించింది. ప్రస్తుతం ఈ బృందం కేరళలోని ఎఫెక్టెడ్ ఏరియాల్లో దీనిపై పరిశోధన చేస్తోంది. దీని అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదికను సమర్పించనుంది. ఈలోగా ఈ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.