గోద్రా ఘటనపై డాక్యుమెంటరీ ప్రదర్శనకు యత్నం.. విద్యార్థుల అరెస్ట్
గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీని ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రదర్శించేందుకు అనుమతించబోమని అంతకుముందు యూనివర్సిటీ వర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపాయి. ఫిబ్రవరి 28 వరకు యూనివర్సిటీ ప్రాంగణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు గుమిగూడటానికి అనుమతించబోమని పేర్కొన్నాయి.
బీబీసీ రూపొందించిన వివాదాస్పద గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి యత్నించిన ఢిల్లీ వర్సిటీకి చెందిన 24 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం గేటు వద్ద ఈ విద్యార్థులందరూ ఈ డాక్యుమెంటరీని తిలకించేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదని వారు చెప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ (నార్త్) సాగర్ సింగ్ తెలిపారు.
గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీని ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రదర్శించేందుకు అనుమతించబోమని అంతకుముందు యూనివర్సిటీ వర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపాయి. ఫిబ్రవరి 28 వరకు యూనివర్సిటీ ప్రాంగణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు గుమిగూడటానికి అనుమతించబోమని పేర్కొన్నాయి. క్యాంపస్‌లో పోలీసులను కూడా మోహరించారు.
అయితే.. వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించి తీరుతామని ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ స్టూడెంట్స్ ఫెడరేషన్ విడివిడిగా ప్రకటించాయి. మరోపక్క కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో దాదాపు 100 మంది విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని తిలకించారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.