Telugu Global
National

బీజేపీ పాలిత రాష్ట్రాల‌లో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు

2020లో షెడ్యూల్డ్ కులాలపై జరిగిన దాడులు(12,714) అత్యథికంగా ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూశాయి. షెడ్యూల్డ్ తెగలపై ఎక్కువగా (2,401) మధ్యప్రదేశ్ లో దాడులు జరిగాయి.

బీజేపీ పాలిత రాష్ట్రాల‌లో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు
X

గిరిజన మహిళకు పట్టం కట్టాం, అత్యున్నత రాష్ట్రపతి పదవి అందించాం, గిరిజనులంటే మాకు ఎంత ప్రేముందో చూడండి అంటూ ఇటీవల కేంద్రంలోని బీజేపీ ఎలా బాకాలు ఊదుకుంటుందో వింటూనే ఉన్నాం. మరి అదే బీజేపీ హయాంలో ఏడాదికేడాది ఎస్సీ, ఎస్టీలపై ఎందుకు దాడులు పెరుగుతున్నాయి. వారికి సంబంధించిన కేసుల సంఖ్య భారీగా పెరగడానికి కారణం ఎవరు..? గిరిజన మహిళకు ఉన్నత పదవి ఇస్తే సరిపోతుందా..? గిరిజన సమాజానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? తాజాగా లోక్ సభలో కేంద్రం ఇచ్చిన సమాధానం వారి చిత్తశుద్ధినే ప్రశ్నించేలా ఉంది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై నేరాలు 2018 నుండి 2020 వరకు భారీగా పెరిగాయని కేంద్రం లోక్‌సభ కు తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఇలా సమాధానమిచ్చారు. ఆయన వెల్లడించిన గణాంకాల ప్రకారం

షెడ్యూల్డ్ కులాలవారిపై..

2018లో షెడ్యూల్డ్ కులాల వారిపై 42,793 నేరాలు జరగగా, 2019లో వాటి సంఖ్య 45,961 కి పెరిగింది. 2020లో షెడ్యూల్డ్ కులాల వారిపై జరిగిన దాడుల విషయంలో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 50,291 కి ఎగబాకింది. అంటే 2018 నుంచి 2020 వరకు నేరాలు 17.52 శాతం పెరిగాయి.

షెడ్యూల్డ్ తెగలపై..

షెడ్యూల్డ్ తెగలపై 2018లో 6,528 నేరాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2019లో వాటి సంఖ్య 7,570 కి పెరిగింది. 2020లో వాటి సంఖ్య 8,272 కి చేరింది. అంటే రెండేళ్లలో ఈ కేసుల సంఖ్య 26.71 శాతం పెరిగింది.

2020లో షెడ్యూల్డ్ కులాలపై జరిగిన దాడులు(12,714) అత్యథికంగా ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూశాయి. షెడ్యూల్డ్ తెగలపై ఎక్కువగా (2,401) మధ్యప్రదేశ్ లో దాడులు జరిగాయి. 2020లో దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలపై జరిగిన దాడులకు సంబంధించి 39,138 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. వీటిల్లో 19,825 కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది. 2020లో షెడ్యూల్డ్ తెగల వారిపై జరిగిన దాడుల్లో 6,484 ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. 3,351 కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉంది.

First Published:  24 July 2022 8:12 AM IST
Next Story