మైనార్టీలని అనుకొని దాడి చేశారు... ఉనా దళితులపై దాడి కేసులో న్యాయవాది వాదన
మైనార్టీల మీద దాడులు చేయడం న్యాయమే అన్నట్టు వాదించారు గుజరాత్ హైకోర్టులో ఓ లాయర్ . తమ క్లైంట్లు మైనార్టీలు అనుకొని దళితులపై దాడి చేశారని, అందువల్ల వారికి బెయిల్ ఇవ్వాలని జడ్జిని కోరాడు.
మతం గురించి విద్వేషం రెచ్చగొడుతూ రాజకీయ నాయకులు మాట్లాడగా ఈ మధ్య చాలా వింటున్నాం. కానీ ఏకంగా కోర్టు లో లాయర్లే ఆ విధంగా జడ్జి ముందు వాధించడం ఎప్పుడైనా విన్నారా ? సమాజం సిగ్గుతో తలవంచుకునేలా వాదించిన ఓ లాయర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం....
గుజరాత్ లోని ఉనాలో 2016 లో కొందరు దళితులను కట్టేసి దారుణంగా కొట్టిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఓ మూక వాళ్ళను ఉనా పట్టణంలో కొట్టుకుంటూ ఊరేగించి తీవ్ర గాయాలపాలైన వారిని పోలీసులకు అప్పగించిన విషయం మర్చిపోదామన్నా మర్చిపోలేం కదా !
జూలై 11, 2016 నాడు గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని ఉనా తాలూకాలోని మోటా సమాధియాలా గ్రామంలో బాలు సర్వయ్య, అతని భార్య కున్వర్, కుమారులు వశ్రమ్, రమేష్, మేనల్లుళ్లు అశోక్, బేచార్, బంధువు దేవ్‌షీ బబారియాపై గోసంరక్షకుల బృందం దాడి చేసింది. వాళ్ళు గోమాంసాన్ని తీసుకెళ్తున్నారని ఆరోపణ చేస్తూ ఆ మూక వాళ్ళ మీద దాడి చేసింది. చుట్టూ ఉన్న వాళ్ళను కూడా రెచ్చగొట్టి దాడిలో భాగస్వాములను చేసింది.
ఆవు కళేబరాన్ని తోలు తీస్తున్నప్పుడు వశ్రామ్, రమేష్, అశోక్, బేచర్లపై గోరక్షకులు అనే స్వయం ప్రకటిత మూక మొదట దాడి చేసి, జంతువును వధించారని ఆరోపించారు. సర్వయ్య తదితరులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని కూడా కొట్టారు. దాడి చేసిన వ్యక్తులు వష్రామ్, రమేష్, అశోక్, బేచార్‌లను కారులో అపహరించి, ఉనా పట్టణానికి తీసుకెళ్లి, ఉనా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలివేసే ముందు బహిరంగంగా ఊరేగించి కొరడాలతో కొట్టారు.
ఈ కేసుపై విచారణ జరిపిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ 34 మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో వాస్తవాలను వక్రీకరించారని, అవసరమైన విధంగా వ్యవహరించలేదని ఆరోపిస్తూ నలుగురు పోలీసుల మీద కూడా చార్జ్ షీట్ నమోదు చేశారు. మొత్తం నిందితుల్లో, 30 మంది ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మిగిలిన నలుగురు నిందితులు రమేష్‌భాయ్ జాదవ్, ప్రమోద్‌గిరి గోస్వామి, బల్వంతగిరి గోస్వామి, రాకేష్ జోషి బెయిల్ పిటిషన్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది B.M. మంగూకియా వాదిస్తూ దాడి చేసిన నిందితులు బాధితులను మైనార్టీలు అనుకున్నారని, వారు దళితులని నిందితులకు తెలియదని, అందుకే దాడి చేశారని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జస్టిస్ నిఖిల్ కారియల్ , "అలా అనడం సరైంది కాదు, రెండు వర్గాల మధ్య తేడాను చూపడానికి ప్రయత్నించడం మంచిది కాదు… ఇది మంచి వాదన కాదు'' అన్నారు.
జస్టిస్ అభ్యంతరంపై స్పంధించిన నిందితుల లాయర్ ''అది నాకు తెలుసు. కానీ నిందితుల ఉద్దేశ్యం దళితుల మీద దాడి చేయడం కాదని చెప్పదల్చుకున్నాను.'' అన్నారు.
ఈ నలుగురు నిందితులకు బెయిల్ కోరుతూ, వారు ఇప్పటికే ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని, ఇది భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్ష కంటే ఎక్కువ అని లాయర్ మంగూకియా వాదించారు. నిందితులు ఇప్పటికే ఆరు సంవత్సరాలు జైలులో ఉన్నందున వారు బెయిల్‌కు అర్హులు అని ఆయన వాదించారు.
అయితే, అసలు ఈ నలుగురు నిందితులే దళితులపై దాడి మొదలుపెట్టినవాళ్ళని , విచారణ ఇంకా కొనసాగుతున్నందున వారికి ఉపశమనం కల్పించరాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.
బాధితుల్లో ఒకరైన వస్రం సర్వయ్య తరఫు న్యాయవాది మేఘా జానీ కూడా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ నలుగురు నిందితులు వాస్తవానికి దాడిని ఆర్గనైజ్ చేశారని జానీ వాదించారు, బాధితులను వాహనంలోకి ఎక్కించే ముందు వారిని కొట్టడానికి చుట్టూ ఉన్నవాళ్ళను ప్రేరేపించారు. వారిని ఉనాకు తీసుకెళ్లి మార్గమధ్యంలో వాహనాన్ని ఆపి బాధితులపై మళ్లీ దాడి చేశారని జానీ తెలిపారు. బాధితులను మార్కెట్‌లో అర్ధనగ్నంగా ఊరేగించి, కొట్టి పోలీసులకు అప్పగించారని జానీ చెప్పారు.
అయితే మైనార్టీలు అనుకొని దాడికి పాల్పడ్డారని, వాళ్ళు దళితులని నిందితులకు తెలియదని నిందితుల తరపు లాయర్ మంగూకియా వాదించడంపై సర్వత్రా విమర్షలు వస్తున్నాయి. మైనార్టీలైతే దాడి చేయవచ్చా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.