Telugu Global
National

టాక్ ఆఫ్ ది నేషన్ గా స్వాతి మలీవాల్..

కేజ్రీవాల్ నేరుగా ఈ వ్యవహారంపై స్పందించకపోవడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఆయన పార్టీ ఎంపీపై, ఆయన మనుషులే దాడి చేస్తే కేజ్రీవాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

టాక్ ఆఫ్ ది నేషన్ గా స్వాతి మలీవాల్..
X

స్వాతి మలీవాల్. గతంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన ఆమె ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసి అవమాన పరిచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈనెల 13 సోమవారం దాడి జరగగా, గురువారం కేసు నమోదు కావడం విశేషం. అప్పటికప్పుడు ఆ దాడి ఘటనను బయటకు చెప్పని ఎంపీ స్వాతి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.


అసలేం జరిగింది..?

ఢిల్లీ లిక్కర్ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఇటీవల విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన్ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలీవాల్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. బయట వేచి చూస్తున్న తనపై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఎంపీ స్థాయి వ్యక్తిని సీఎంకి పీఏగా పనిచేసే వ్యక్తి ఎందుకు కొట్టాడు, ఎందుకు గాయపరిచాడు అనేది తేలాల్సి ఉంది. స్వాతి మలీవాల్ కూడా సరైన కారణం చెప్పలేకపోతున్నారు. తనని కొట్టారు, గాయపరిచారు.. అని మాత్రమే ఆమె ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టార్గెట్ కేజ్రీవాల్..

స్వాతి మలీవాల్ దాడి వ్యవహారంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇరుకున పడింది. దాడి ఘటనను ఖండించిన పార్టీ వర్గాలు, బిభవ్ పై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపాయి. అయితే కేజ్రీవాల్ నేరుగా ఈ వ్యవహారంపై స్పందించకపోవడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఆయన పార్టీ ఎంపీపై, ఆయన మనుషులే దాడి చేస్తే కేజ్రీవాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా బిభవ్ ని సీఎం కేజ్రీవాల్ వెంట తిప్పుకోవడం సరికాదన్నారు. సీఎం ఇంటిలో దాడి జరగడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

First Published:  17 May 2024 4:18 PM IST
Next Story