Telugu Global
National

బాల్య వివాహాలు చేసుకున్న పురుషుల అరెస్టుపై భగ్గుమంటున్న మహిళలు

తన కుమారుడు ఒక మైనర్ బాలికతో పారిపోయాడని, పోలీసులు తన కుమారుడికి బదులుగా భర్తను అరెస్టు చేశారని, ఇదేం న్యాయమని ఓ మహిళ ప్రశ్నించింది.

బాల్య వివాహాలు చేసుకున్న పురుషుల అరెస్టుపై భగ్గుమంటున్న మహిళలు
X

అస్సోంలో బాల్య వివాహాలను నిరోధించడానికి, మాతా శిశు మరణాలను అరికట్టడానికి మైనర్లను పెళ్లి చేసుకున్న పురుషులపై ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,004 మంది పురుషులు బాల్యవివాహాలు చేసుకున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని పోలీసులతో అరెస్టు చేయిస్తోంది. శనివారం నాటికి 2,211 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు.

బాల్య వివాహాలు చేసుకుంటున్న పురుషులను అరెస్టు చేస్తే మైనర్లను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ సాహసించరని సీఎం హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం భావించగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పురుషులను అరెస్టు చేయడంపై వారి భార్యలు, తల్లులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

బాల్య వివాహాలు చేసుకున్నారని పురుషులను అరెస్టు చేసి జైలుకు పంపితే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని వారి భార్యలు, తల్లులు ప్రశ్నిస్తున్నారు. తమకు 16, 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి జరిగిందని, ఇప్పుడు తమకు 19, 20 ఏళ్లు ఉన్నాయని, తాము మేజర్లు అయిన తర్వాత తమ భర్తలను అరెస్టు చేస్తే లాభం ఏంటని పలువురు మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు.

తన కుమారుడు ఒక మైనర్ బాలికతో పారిపోయాడని, అయితే పోలీసులు తన కుమారుడికి బదులుగా భర్తను అరెస్టు చేశారని, ఇదేం న్యాయమని ఓ మహిళ ప్రశ్నించింది. బాల్య వివాహాలు చేసుకున్న చాలామంది మహిళలు ఇప్పుడు గర్భంతో ఉన్నారు. తమ భర్తలను ప్రభుత్వం అరెస్టు చేయించిందని, ఇక మా బాగోగులు చూసుకునేది ఎవరని పలువురు గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అస్సోంలో బాల్య వివాహాలు చేసుకున్న పురుషులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ లలో తరలిస్తుండగా.. వ్యాన్ల వద్దకు భారీగా తరలివస్తున్న మహిళలు, పిల్లల రోదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాల్యవివాహాలను అరికట్టేందుకు హిమంత బిస్వా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని మొదట అందరూ భావించినప్పటికీ మహిళల వేదన చూసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదేమోనని అభిప్రాయపడుతున్నారు.

First Published:  4 Feb 2023 5:19 PM IST
Next Story