Telugu Global
National

భార్య మృతిని తట్టుకోలేక ఐపీఎస్‌ ఆత్మహత్య

క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య తుది శ్వాస విడవడంతో ఆమె ఎడబాటును తట్టుకోలేక ఓ ఐపీఎస్‌ అధికారి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన గువాహటిలో జరిగింది.

భార్య మృతిని తట్టుకోలేక ఐపీఎస్‌ ఆత్మహత్య
X

క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్య తుది శ్వాస విడవడంతో ఆమె ఎడబాటును తట్టుకోలేక ఓ ఐపీఎస్‌ అధికారి తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన గువాహటిలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన శిలాదిత్య చెతియా 2009 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన అస్సాం హోం శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఐపీఎస్‌ అధికారి శిలాదిత్య చెతియా భార్య కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగవలేదు. శిలాదిత్య నాలుగు నెలలుగా సెలవులో ఉండి ఆమెను దగ్గరుండి చూసుకుంటున్నారు. అస్సాంలోని గువాహటికి చెందిన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు.

భార్య మృతిచెందిన సమాచారం తెలిసిన వెంటనే శిలాదిత్య ఐసీయూ వద్దకు వచ్చారు. ఆమె వద్ద కొద్దసేపు ఒంటరిగా ఉంటానని చెప్పి.. అక్కడున్న వైద్య సిబ్బందిని బయటికి వెళ్లాలని కోరారు. తాము బయటికి వెళ్లిన కొద్దిసేపటికే లోపలి నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని, వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. శిలాదిత్య తుపాకీతో కాల్చుకొని ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. వెంటనే ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వివరించారు.

ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పటి నుంచీ ఆయన ఆందోళనగా కనిపించేవారని ఉన్నతాధికారులు తెలిపారు. ఆమె వద్దే ఉండి బాగోగులు చూసుకునేవారని వెల్లడించారు. ఇప్పుడు ఈ దురదృష్టకర ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిన్‌ సుకియా, సోనిత్‌ పుర్‌ జిల్లాల ఎస్పీగా పనిచేసిన శిలాదిత్య.. అస్సాం పోలీసు విభాగం ఫోర్త్‌ బెటాలియన్‌ కమాండెంట్‌గా కూడా విధులు నిర్వర్తించారు.

First Published:  20 Jun 2024 4:45 AM GMT
Next Story