Telugu Global
National

అస్సోం ప్రభుత్వం సంచలనం.. బాల్య వివాహాలు చేసుకున్న 1800 మంది అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా బాలికలను వివాహం చేసుకున్న పురుషుల లిస్టు తయారు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు ఒకేరోజు 1800 మంది పురుషులను అరెస్ట్ చేశారు.

అస్సోం ప్రభుత్వం సంచలనం.. బాల్య వివాహాలు చేసుకున్న 1800 మంది అరెస్ట్
X

బాల్య వివాహాలు చేసుకున్న వారిపై అస్సోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బాలికలను పెళ్లి చేసుకున్న 1800 మందిని కేవలం ఒకే ఒక్క రోజులో పోలీసులతో అరెస్టు చేయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ విషయాన్నివెల్ల‌డించారు. బాల్య వివాహాలు చేసుకున్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్న పురుషులపై పోక్సో చట్టం కింద, 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్న పురుషులపై బాల్య వివాహ నిషేధ చట్టం -2006 కింద కేసులు నమోదు చేయాలని కొద్ది రోజుల కిందట అస్సోం మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలను వివాహం చేసుకున్న పురుషుల లిస్టు తయారు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు ఒకేరోజు 1800 మంది పురుషులను అరెస్ట్ చేశారు.


దీనిపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా ఒక ట్వీట్ చేశారు. 'రాష్ట్రవ్యాప్తంగా 4,004 మంది బాల్య వివాహాలు చేసుకున్నట్లు నిర్ధారించాం. వారిపై కేసులు నమోదు చేసి శుక్రవారం ఒక్కరోజే 1800 మందిని అరెస్టు చేయించాం. మిగిలినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. మాత శిశు మరణాలకు కారణమైన బాల్యవివాహాలను అరికట్టెందుకే ఇలా చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలి.

ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేయడం లేదు. బాల్య వివాహాలు చేసిన మత పెద్దలు, పూజారులపై కూడా తగిన చర్యలు తీసుకుంటాం' అని సీఎం హిమంత బిస్వా ట్వీట్ చేశారు. మాతా శిశు మరణాలను అరికట్టడానికి అస్సోం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

First Published:  3 Feb 2023 11:50 AM GMT
Next Story