Telugu Global
National

థరూర్ కు ఓటేసిన వారంతా బీజేపీలో చేరతారన్న అస్సాం సీఎం.... ఘాటుగా స్పందించిన థరూర్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్ కు ఓటు వేసిన వారే నిజ‌మైన ప్ర‌జాస్వామిక వాదులని, వారంతా త్వరలో బీజేపీలో చేరుతారని అస్సాం సీఎ‍ హేమంత్ బిశ్వాస్ శ‌ర్మ వ్యాఖ్యానించారు. దీనిపై థ‌రూర్ ఘాటుగా స్పందించారు.

థరూర్ కు ఓటేసిన వారంతా బీజేపీలో చేరతారన్న అస్సాం సీఎం.... ఘాటుగా స్పందించిన థరూర్
X

ప్ర‌జాస్వామ్య‌యుతంగా పోరాడే ధైర్యం లేని వారే ప్ర‌త్య‌ర్ధి పార్టీల నాయ‌కుల‌ను ప్ర‌లోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్ అన్నారు. అస్సాం బిజెపి ముఖ్య‌మంత్రి హేమంత్ బిశ్వాస్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌పై థ‌రూర్ ఘాటుగా స్పందించారు.

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ప‌త‌నావ‌స్థ‌లో ఉంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి హేమంత్ బిశ్వాస్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ నుంచి దాదాపు వెయ్యిమంది బిజెపిలో చేర‌తార‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్స ఎన్నిక‌ల్లో శ‌శిథ‌రూర్ కు ఓటు వేసిన‌వారే నిజ‌మైన ప్ర‌జాస్వామిక వాదుల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఫ‌లితాల‌కు ముందే అధ్య‌క్షుడు ఎవ‌రో తెలిసిపోయింద‌ని, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

"కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు ఒక ఫార్స్ . ఓట్ల లెక్కింపున‌కు ముందే ఫలితం తెలిసిపోయింది. లెక్కింపు పూర్తికాక‌ముదే ఖ‌ర్గే పార్టీ ఛీఫ్ అని ప్రకట‌న వ‌చ్చేసింది. శశి థరూర్‌కు ఓటు వేయడం ద్వారా ధైర్యాన్ని ప్రదర్శించిన 1,000 మంది ప్రతినిధులు మాత్ర‌మే కాంగ్రెస్‌లోని ఏకైక ప్రజాస్వామ్య వాదులు . వారు త్వరలో బీజేపీలో చేరతారని ఆశిస్తున్నాను." అని అన్నారు.

బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత శశి థరూర్ తీవ్రంగా స్పందించారు. " ధైర్యం లేని వారు మాత్రమే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడానికి ప్రలోభాలకు గురవుతారని" అన్నారు. "ధైర్యాన్ని ప్రదర్శించే వారు బీజేపీలో ఎన్నటికీ చేరరు. పోరాడే ధైర్యం లేని వారు మాత్రమే అలా ప్రలోభాలకు గురవుతారు." అని ఘాటుగా స్పందించారు. పోరాడే ధైర్యం లేని వారే బీజేపీలో చేరాలని ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని థరూర్ దుయ్య‌బ‌ట్టారు. 24 ఏళ్ల త‌ర్వాత గాంధీయేతర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖ‌ర్గే ఎన్నిక‌య్యారు. థరూర్ ఆయ‌న పై పోటీచేసిన విష‌యం తెలిసిందే. అక్టోబరు 17న జరిగిన ఎన్నికల్లో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి.

First Published:  13 Nov 2022 12:37 PM IST
Next Story