Telugu Global
National

భర్తలారా మీకు మూడింది.. సీఎం బహిరంగ హెచ్చరిక

వివాహ వయసు రాకుండా పెళ్లి చేసుకోవడం ఎంత నేరమో, వివాహ వయసు మీరిపోతున్నా పెళ్లి చేసుకోకపోవడం కూడా అంతే తప్పని చెప్పారు అసోం సీఎం. మాతృత్వానికి తగిన వయసు 22-30 ఏళ్లని చెప్పారాయన.

భర్తలారా మీకు మూడింది.. సీఎం బహిరంగ హెచ్చరిక
X

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. తమ రాష్ట్రంలోని భర్తలకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. భర్తలంటే అందరు భర్తలు కాదు 18 ఏళ్లలోపు వయసున్న యువతులను పెళ్లి చేసుకున్న వారు మాత్రమే. వారందర్నీ కటకటాల వెనక్కు నెడతామని బహిరంగ వేదికపైనుంచి హెచ్చరికలు జారీ చేశారాయన. మహిళల వివాహాలు, గర్భధారణ విషయంలో అసోంలో కొన్ని దురాచారాలు ఇంకా అమలులో ఉన్నాయని, వాటికి కారకులను, ఆ తప్పులు చేస్తున్న మగవారిని కూడా శిక్షించాల్సిందేనన్నారాయన.

వేలాది మంది అరెస్ట్..

ఐదారు నెలల్లోనే వేలాది మంది భర్తలను అరెస్ట్‌ చేస్తామని చెప్పారు అసోం సీఎం. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరమని తెలిపారు. ఆ వ్యక్తి చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భర్త అయినా కూడా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారంతో సమానమని చెప్పారు. అలాంటివారంతా జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు సీఎం శర్మ.

మహిళలు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు 18 ఏళ్లు అని తెలిపారు సీఎం. తక్కువ వయస్సు వివాహాలు, మాతృత్వాన్ని ఆపడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారాయన. తక్కువ వయసు అమ్మాయిలను వివాహం చేసుకున్న భర్తలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి భర్తలు జీవిత ఖైదు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాబోయే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్టవుతారని హెచ్చరించారు.

పెళ్లి వయసు దాటేయొద్దు..

వివాహ వయసు రాకుండా పెళ్లి చేసుకోవడం ఎంత నేరమో, వివాహ వయసు మీరిపోతున్నా పెళ్లి చేసుకోకపోవడం కూడా అంతే తప్పని చెప్పారు అసోం సీఎం. మాతృత్వానికి తగిన వయసు 22-30 ఏళ్లని చెప్పారాయన. తగిన వయస్సులో మాతృత్వాన్ని స్వీకరించకపోతే వైద్యపరమైన సమస్యలు ఎదురవుతాయని, తగిన వయసు ఉన్నా పెళ్లి కాని ఆడవాళ్ళు త్వరగా వివాహం చేసుకోవాలని సూచించారు.

First Published:  28 Jan 2023 4:46 PM IST
Next Story