Telugu Global
National

షారుఖ్ ఖానా..? ఆయనెవరూ..? అస్సోం సీఎం సెటైర్లు

షారుఖ్ సినిమా పోస్టర్లు దహనం చేయడంపై ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మను మీడియా ప్రశ్నించగా..షారుఖ్ ఖానా? ఆయనెవరూ? నాకు ఆయన గురించి కానీ, ఆయన నటిస్తున్న పఠాన్ సినిమా గురించి కానీ తెలియదే.. అని సమాధానం ఇచ్చారు.

షారుఖ్ ఖానా..? ఆయనెవరూ..? అస్సోం సీఎం సెటైర్లు
X

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరేమో.. అయితే అస్సోం ముఖ్యమంత్రి మాత్రం షారుక్ ఖానా.. అతనెవరో నాకు తెలియదే అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. షారుక్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. కాగా, కొద్ది రోజుల కిందట పఠాన్ మూవీ నుంచి బేషరమ్ రంగ్ అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటలో కాషాయ రంగు బికినీ ధరించి దీపిక ప్రదర్శించిన భంగిమలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా విడుదలను ఆపాలని పలు రాష్ట్రాల్లో వీహెచ్ పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సభ్యులు వివాదానికి కారణమైన పాటలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు. ఇదిలా ఉండగా.. తాజాగా అస్సోంలోని నరెంగి పట్టణంలో పఠాన్ సినిమా విడుద‌ల కానున్న థియేటర్ వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పఠాన్ సినిమా పోస్టర్లు చించివేసి తగులబెట్టారు. థియేటర్ వద్ద నానా హంగామా చేశారు.

షారుఖ్ సినిమా పోస్టర్లు దహనం చేయడంపై ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మను మీడియా ప్రశ్నించగా..షారుఖ్ ఖానా? ఆయనెవరూ? నాకు ఆయన గురించి కానీ, ఆయన నటిస్తున్న పఠాన్ సినిమా గురించి కానీ తెలియదే.. అని సమాధానం ఇచ్చారు. కొన్ని సమస్యలు ఉన్నాయని బాలీవుడ్ కు చెందిన చాలామంది ఫోన్ చేశారని, కానీ మీరు చెబుతున్న షారుక్ ఖాన్ మాత్రం తనకు ఫోన్ చేయలేదన్నారు. ఒకవేళ ఆయన ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తానన్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారుక్ ఖాన్ తెలియకపోవడం ఏంటి? అని.. మళ్లీ విలేకరులు ముఖ్యమంత్రి ని ప్రశ్నించగా శర్మ మరింత ఘాటుగా సమాధానం ఇచ్చారు. అస్సోం ప్రజలు అస్సామీ సినిమాల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారని, హిందీ సినిమాల కోసం కాదన్నారు. అస్సామీలో దివంగత నిపోన్ గోస్వామి దర్శకత్వం వహించిన డాక్టర్ బెజ్ బారువా పార్ట్ 2 కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

First Published:  22 Jan 2023 11:23 AM IST
Next Story