Telugu Global
National

తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. కూల్చి ఆలయం కట్టండి.. ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యే వినతి

తాజ్ మహల్, కుతుబ్ మినార్ కట్టడాలను కూల్చి వాటి స్థానంలో హిందూ దేవాలయాలను నిర్మించాలని రుప్ జ్యోతి కుర్మీ ప్రధానికి విన్నవించారు. హిందూ రాజులు ఇచ్చిన నిధులతోనే తాజ్ మహల్ ని కట్టారని రుప్ జ్యోతి కుర్మీ పేర్కొన్నారు

తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. కూల్చి ఆలయం కట్టండి.. ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యే వినతి
X

తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదని.. దానిని కూల్చివేసి ఆలయం కట్టాలని అస్సోం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనదేశంలో తాజ్‌మహల్‌ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం తాజ్ మహల్ ను నిర్మించారు. తాజ్ మహల్ ను ఇప్పటికీ ప్రేమకు ప్రతిరూపంగానే చెప్పుకుంటారు. మన దేశానికి వచ్చే విదేశీయులు తప్పకుండా సందర్శించే ప్రసిద్ధ క‌ట్ట‌డాల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి. అలాంటి తాజ్ మహల్ ను కూల్చివేయాలని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

అస్సోం బీజేపీ ఎమ్మెల్యే రుప్ జ్యోతి కుర్మీ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మొగల్ చక్రవర్తుల కాలంలో కట్టిన తాజ్ మహల్, కుతుబ్ మినార్ కట్టడాలను కూల్చివేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. భార్య ముంతాజ్ పై ప్రేమతోనే షాజహాన్ తాజ్ మహల్ ని కట్టాడని చెబుతారని.. నిజంగా ముంతాజ్ పై ప్రేమ ఉంటే షాజహాన్ ఆమె చనిపోయిన తర్వాత మరో మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడని రుప్ జ్యోతి కుర్మీ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాని మోదీని కోరారు.

తాజ్ మహల్, కుతుబ్ మినార్ కట్టడాలను కూల్చి వాటి స్థానంలో హిందూ దేవాలయాలను నిర్మించాలని రుప్ జ్యోతి కుర్మీ ప్రధానికి విన్నవించారు. హిందూ రాజులు ఇచ్చిన నిధులతోనే తాజ్ మహల్ ని కట్టారని రుప్ జ్యోతి కుర్మీ పేర్కొన్నారు. తాజ్ మహల్ ని కూల్చి ఆలయ నిర్మాణం చేపడితే ఎమ్మెల్యేగా తన ఏడాది జీతభత్యాలను విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.కాగా, తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం కాదని దాన్ని కూల్చివేయాలని రుప్ జ్యోతి కుర్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. చారిత్రక కట్టడాలను కూల్చివేయాలని రుప్ జ్యోతి కుర్మీ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  7 April 2023 2:55 PM IST
Next Story