Telugu Global
National

తన గొయ్య తానే తవ్వుకున్న గెహ్లాట్.. పార్టీ అధ్యక్ష పదవి రేస్ నుంచి ఔట్

ఇప్పటికే అశోక్ గెహ్లాట్‌ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవాలనే ఆదేశాలు వెళ్లాయి. ఆయన స్థానంలో సీనియర్ నాయకులు మల్లిఖార్జున్ ఖర్గే, కమల్ నాథ్, కేసీ వేణుగోపాల్, ముఖుల్ వాస్నిక్‌లలో ఒకరు పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తన గొయ్య తానే తవ్వుకున్న గెహ్లాట్.. పార్టీ అధ్యక్ష పదవి రేస్ నుంచి ఔట్
X

కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. పార్టీ గౌరవించి ఆయనకు జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని భావిస్తే.. రాజస్థాన్‌లో అధికారాన్ని వదులకోలేక తప్పటడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఒకవైపు రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేస్తున్న సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభానికి ప్రయత్నించారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆయనపై చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అశోక్ గెహ్లాట్‌ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవాలనే ఆదేశాలు వెళ్లాయి. ఆయన స్థానంలో సీనియర్ నాయకులు మల్లిఖార్జున్ ఖర్గే, కమల్ నాథ్, కేసీ వేణుగోపాల్, ముఖుల్ వాస్నిక్‌లలో ఒకరు పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆఖరి నిమిషంలో ఇలా తిరుగుబాటు చేయడం సోనియా గాంధీకి కూడా షాక్ ఇచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొదట రాజస్థాన్ సీఎం, జాతీయ అధ్యక్ష పదవిలో ఉంటానని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కానీ, రాహుల్ గాంధీ ఆ మరుసటి రోజే 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అని గతంలోనే తీర్మానం చేశామని, దానికే కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. దీంతో రాజస్థాన్ సీఎంగా దిగిపోవడానికి గెహ్లాట్ ఒప్పుకున్నారు. పైకి సీఎం కుర్చీని వదిలేస్తున్నట్లు ప్రకటించిన గెహ్లాట్.. తెరవెనుక తన మనిషే సీఎంగా ఉండటానికి పావులు కదిపారు. ఆదివారం సీఎల్పీ మీటింగ్‌కు ఉందని ఎమ్మెల్యేలందరికీ సమాచారం ఇవ్వగా.. గెహ్లాట్ ఇంటికి కొంత మందే వచ్చారు. కానీ గెహ్లాట్‌కు సన్నిహితుడైన మంత్రి శాంతి ధరివాల్ ఇంటిలో సమావేశం అయ్యారు.

రాజస్థాన్ తర్వాతి సీఎంను ఎన్నుకునే అవకాశం కొత్త జాతీయ అధ్యక్షుడికి కట్టబెట్టాలని తీర్మానం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం భగ్గుమన్నది. అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేస్తే ఆయనే జాతీయ అధ్యక్షుడు అవుతారు. అంటే పరోక్షంగా గెహ్లాట్‌కు ఆ అధికారం కట్టబెట్టడంపై మండిపడింది. ఇది కావాలని గెహ్లాట్ ఆడిస్తున్న నాటకమని అంచనాకు వచ్చింది. మంగళవారం అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆయన అభ్యర్థిత్వానికి ఓకే చెప్పిన సోనియా గాంధీ ఇప్పుడు ఏం చేయబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి.. ఎవరైనా నామినేషన్ వేయడానికి అర్హత కలిగి ఉంటారు. కానీ, గెలవాలంటే హైకమాండ్ ఆశీస్సులు ఉండాలి. గెహ్లాట్ నామినేషన్ వేసినా.. ఆయన గెలవడానికి గాంధీ కుటుంబం ఇప్పుడు ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అధికార దాహంతో సీనియర్ నేత గెహ్లాట్ తన గొయ్యిని తానే తవ్వుకున్నారని.. అన్ని పార్టీలు యువతను ప్రోత్సహిస్తుంటే.. సచిన్ పైలెట్ సీఎం కుర్చీపై కూర్చోవద్దనే దురాశతో ఇలా తిరుగుబాటును ప్రోత్సహించారని భావిస్తోంది. అలాంటి వ్యక్తిని జాతీయ అధ్యక్ష పదవి కట్టబెడితే పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం కూడా పోతుందని అంచనా వేస్తోంది. ఇవ్వాళ ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక సమావేశం నిర్వహించనున్నది. ఇందులో పార్టీ అధ్యక్ష ఎన్నికపై చర్చ జరుగనున్నది. అలాగే రాజస్థాన్ కాంగ్రెస్‌కు చెందిన రెండు వర్గాలను కూడా ఢిల్లీలో కూర్చోబెట్టి మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  27 Sept 2022 12:43 PM IST
Next Story