రాష్ట్రపతి భవన్ కి బీజేపీ రాజకీయ మరక..
కేంద్ర ప్రభుత్వ వాలకం చూస్తుంటే జమిలి ఎన్నికలపై ఆల్రడీ నిర్ణయం తీసేసుకున్నారని, ఇప్పడు కేవలం కమిటీ పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. కేవలం ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెట్టేందుకే కమిటీ అనే లాంఛనాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు.
‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి బీజేపీ నియమించిన కమిటీ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. రాష్ట్రపతి భవన్ కి రాజకీయాలతో ఎందుకు ముడిపెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ఆ తర్వాత రాజకీయ పదవుల జోలికి రారు. కానీ రామ్ నాథ్ కోవింద్ ని ఏరికోరి ఈ కమిటీకి అధ్యక్షుడిగా చేయడం వెనక బీజేపీ రాజకీయ దురుద్దేశాలు బయటపడుతున్నాయని విమర్శించారు అసదుద్దీన్. రాష్ట్రపతి పదవి ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేయొద్దని సూచించారు.
కమిటీలోని సభ్యులంతా బీజేపీకి వంతపాడేవారంటూ మండిపడ్డారు అసదుద్దీన్. గతంలో వారంతా బీజేపీ అనుకూల స్టేట్ మెంట్లు ఇచ్చినవారేనని గుర్తు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతను ఎంపిక చేయకుండా, మాజీ వైపు చూడటమేంటని విమర్శించారు. భారత సమాఖ్య వాదానికి జమిలి ఎన్నికలు గొడ్డలిపెట్టు అన్నారు అసద్.
ముందే నిర్ణయం.. ఇప్పుడు నాటకం..
కేంద్ర ప్రభుత్వ వాలకం చూస్తుంటే జమిలి ఎన్నికలపై ఆల్రడీ నిర్ణయం తీసేసుకున్నారని, ఇప్పడు కేవలం కమిటీ పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. కేవలం ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెట్టేందుకే కమిటీ అనే లాంఛనాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. దేశంలో ఇతర ఏ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ దుర్మార్గంగా ఆలోచిస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగానికి, రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థకు ఇది విరుద్ధమన్నారు. జమిలికోసం కనీసం 5 ఆర్టికల్స్ ని సవరించాలని, మరెన్నో నియమాలను సడలించాలని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ చేస్తున్న దాడిగా ఈ వన్ నేషన్ - వన్ ఎలక్షన్ విధానాన్ని అభివర్ణించారు అసదుద్దీన్ ఒవైసీ.