Telugu Global
National

న్యూయార్క్ టైమ్స్ క‌థ‌న‌మే శిసోడియా ఇంటిపై సిబిఐ దాడికి కార‌ణ‌మా?

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ శిసోడియాపై సీబీఐ దాడి చేయడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా స్పంధించారు. ఢిల్లీ పాఠశాలల గురించి న్యూయార్క్ టైమ్స్ క‌థ‌న‌మే శిసోడియా ఇంటిపై సిబిఐ దాడికి కార‌ణ‌మని కేజ్రీవాల్ ఆరోపించారు.

న్యూయార్క్ టైమ్స్ క‌థ‌న‌మే శిసోడియా ఇంటిపై సిబిఐ దాడికి కార‌ణ‌మా?
X

బిజెపియేత‌ర ప్ర‌భుత్వాల‌పై సిబిఐ, ఈడీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎలా ఉసిగొలుపుతుందో ఈ తాజా ఉద‌హ‌ర‌ణ వెల్ల‌డిస్తుంద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ క‌థ‌న‌మే శిసోడియా ఇంటిపై సిబిఐ దాడికి కార‌ణ‌మ‌ని, అభివృద్ధిని ఓర్వ‌లేని బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఇలా దాడులు చేయిస్తోంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

కాగా, నిన్న ఢిల్లీలో మ‌నీష్ సిసోడియా ఇంటితో పాటు 20 చోట్ల సిబిఐ దాడులు చేసింది. అదే రోజున ఢిల్లీ ప్ర‌భుత్వం విద్యావ్య‌స్థ‌లోను,పాఠ‌శాల‌ల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లోనూ తీసుకొచ్చిన మార్పుల‌ను ప్ర‌శంశిస్తూ మ‌నీష్ సిసోడియా ఫొటోతో న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టిక‌ల్ ప్ర‌చ‌రించింది. ఈ వ్యాసం ప్ర‌చురిత‌మైన రోజునే సిసోడియా ఇంటిపై దాడి జ‌ర‌గింద‌ని, అది కేంద్ర ప్ర‌భుత్వ ప్రేర‌ణ‌తోనేన‌ని కేజ్రీవాల్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో వారు ఆశించిన‌ట్టు ఏమీ దొర‌క‌లేదని ఆయ‌న అన్నారు.

ఈ దాడిపై మనీష్ సిసోడియా స్పందిస్తూ, కేంద్ర ప్రాంత‌మైన ఢిల్లీ ని అభివృద్ధి చేయకుండా త‌మ‌ ప్రభుత్వాన్ని నిలువ‌రించ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని అన్నారు.

ఇంత‌కీ న్యూయార్క్ టైమ్స్ కథనంలో ఏముందంటే..

పరిశోధనాత్మక రిపోర్టింగ్‌లో 2020 పులిట్జర్ ప్రైజ్‌కి ఫైనలిస్ట్‌గా ఎంపికైన ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ కరణ్ దీప్ సింగ్ 'మా పిల్లలు విలువైనవారు' అనే శీర్షికతో ఈ కథనాన్ని రాశారని న్యూయార్క్ టైమ్ పేర్కొంది. దీనిలో ఢిల్లీలోని ఆప్ ప్ర‌భుత్వం విద్యావ్య‌వ‌స్థ‌లో తీసుకొచ్చిన మార్పుల‌ను, అభివృద్ధి గురించి వివ‌రించారు. ఆప్ త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఇచ్చిన మెరుగైన విద్య‌, వైద్యం హామీల‌కు అనుగుణంగా ఈ మార్పులు చేప‌ట్టింద‌ని పేర్కొంది. పంజాబ్ ఎన్నిక‌ల్లో కూడా ఇవే హామీలు వారిని గెలిపించాయి. ఢిల్లీ న‌గ‌రంలో ముఖ్యంగా పాఠ‌శాల‌ల్లో ఆప్ ప్ర‌భుత్వం క‌ల్పించిన మౌలిక స‌దుపాయాలు, చేసిన అభివృద్ధి గురించి వివ‌రించింది.

"భారతదేశంలో, లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విద్యను మార్గంగా ఎంచుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్న భవనాలు, నిర్వహణ లోపం, సరైన బోధన లేకపోవడం, కలుషితమైన మధ్యాహ్న భోజనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండేవి. ఢిల్లీలోని శ్రామిక వ‌ర్గాల ప్రాంతంలో ఉన్న పాశ్వాన్ పాఠశాలలో ఒక‌ప్పుడు క‌నీస సౌక‌ర్యాలు కూడా లేక, నిత్యం గొడ‌వ‌ల‌తో "రెడ్ స్కూల్" అని పిలిచే వారు. కానీ ఈ రోజు, ఢిల్లీ ప్ర‌భుత్వం విద్యా వ్యవస్థలో తెచ్చిన విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల వ‌ల్ల ఆ పాఠాశాల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింద‌ని" రిపోర్టర్ రాశారు. ఈ పాఠశాలలో 10, 12వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణ‌త శాతం కూడా బాగా పెరిగ‌గింద‌ని క‌థ‌నం పేర్కొంది.

" కొన్ని పాఠ‌శాల‌లు ఇటీవలి వరకు తాగునీరు లేకపోవ‌డం, పాములు చేరుతుండ‌డం వంటి ప‌రిస్థితుల్లో ఉండేవి. కానీ కేజ్రీవాల్ పాఠశాలలను పునర్నిర్మించడానికి బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తున్నారు. పాఠశాలల్లో కొత్త పాఠ్యాంశాలను రూపొందించడానికి ఉన్నత విద్యా నిపుణులు, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యంతో ప‌నిచేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి త‌లిదండ్రుల‌తో కలిసి పని చేస్తూ రోజువారీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఎంతో కృషిచేస్తున్నారు."అని పేర్కొంది.

First Published:  19 Aug 2022 4:01 PM IST
Next Story