డేంజర్లో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్? పలువురు ఆప్ ఎమ్మెల్యేల మిస్సింగ్!
ఢిల్లీ ఆప్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ ప్రణాళిక రచిస్తోందా ? కేజ్రీవాల్ గురువారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు రాకుండా గైర్ హాజరయినట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తమ పార్టీలో చేరే ఆప్ ఎమ్మెల్యేలకు 20 నుంచి 25 కోట్ల వరకు నజరానా ఇస్తామంటూ ఈ పార్టీ చేసిన ఆఫర్ కేజ్రీవాల్ శిబిరంలో డేంజర్ బెల్ మోగిస్తోంది... గురువారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు రాకుండా గైర్ హాజరయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్ అయిన ఈ ఎమ్మెల్యేల్లో సౌరవ్ భరద్వాజ్ అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. . ఆయనకు బీజేపీ నేతలు 20 కోట్ల ఆఫర్ ఇచ్చారట.. తమ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కాషాయ పార్టీ చేస్తున్న యత్నాలను, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడుల గురించి చర్చించేందుకు కేజ్రీవాల్ తన ఇంట్లోనే ఎమ్మెల్యేల మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ముందే.. బీజేపీ... తమ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు యత్నిస్తోందని ఆప్ నేత దిలీప్ పాండే ఆరోపించారు. తన 'ఆకర్ష యత్నాల్లో' భాగంగా ఆ పార్టీ.. సుమారు 40 మంది ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేసిందని ఆయన చెప్పారు.
నిన్నటికి నిన్న 'బీజేపీ బంద్ కరో.. దేశ్ సే ధోఖా.. నహీ చలేగా 50 ఖోఖా' అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నినాదాలు చేసిన సౌరవ్ భరద్వాజ్ ఈ రోజు పత్తా లేకుండా పోయినట్టు సమాచారం. . బీజేపీ మోసాలకు చెక్ పెట్టాలని, మహారాష్ట్ర తరహా పోకడలను అడ్డుకోవాలని ఆయన కేకలు పెట్టారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీబీఐ, ఈడీ దాడులపై చర్చించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం రేపు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తోంది. ఆప్ లో చీలిక తెచ్చిన పక్షంలో మిమ్మల్ని సీఎం అభ్యర్థిని చేస్తామని బీజేపీ నుంచి తనకు మెసేజ్ అందినట్టు డిప్యూటీ సీఎం సిసోడియా ఇదివరకే చెప్పారు. అయితే తాను కేజ్రీవాల్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. తాము 20 కోట్ల ఆఫర్ ని ఎవరికి ఇవ్వజూపామో వారి పేర్లు చెప్పాలని బీజేపీ.. ఆప్ నేతలను సవాల్ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య గురువారం కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనమవుతోంది.