Telugu Global
National

ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దంటున్న కేజ్రీవాల్.. ఎందుకంటే..?

గుజరాత్ లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా మళ్లీ బీజేపీకే అధికారం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ కేజ్రీవాల్ మాత్రం 182 సీట్ల గుజరాత్ లో తమ పార్టీకి 100 సీట్లు ఖాయం అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దంటున్న కేజ్రీవాల్.. ఎందుకంటే..?
X

పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకుని దూకుడు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటోంది. అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసింది. హోరా హోరీగా ప్రచారం చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ డీలా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం కాస్తో కూస్తో ఈ ఎన్నికల్లో కనపడుతుందనే అభిప్రాయం మాత్రం అందరిలో ఉంది. దాన్నే ఎగ్జిట్ పోల్స్ రుజువు చేశాయి. గుజరాత్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని అనుకున్నా, ఆప్ కేవలం 8 సీట్లకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ స్థానం మెరుగుపడుతుందని తెలుస్తోంది. అటు హిమాచల్ ఎన్నికల్లో బీజేపీకి బొటాబొటీ మెజార్టీ దక్కే అవకాశం ఉంది, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని, ఆప్ మార్క్ అంతంతమాత్రమేనని తెలుస్తోంది. ఈ దశలో ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. గుజరాత్ పీఠం తమదేనంటున్నారాయన.

గుజరాత్ లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా మళ్లీ బీజేపీకే అధికారం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ కేజ్రీవాల్ మాత్రం 182 సీట్ల గుజరాత్ లో తమ పార్టీకి 100 సీట్లు ఖాయం అంటున్నారు. గుజరాత్ లో తాము అధికారాన్ని కైవసం చేసుకుంటామని నమ్మకంగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని అంటున్నారు.

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ని మాత్రం కేజ్రీవాల్ స్వాగతించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆప్ 150సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇక్కడ అధికారం ఆప్ కే దక్కుతుందని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. వీటిని మాత్రం నమ్మాల్సిందేనంటున్నారు కేజ్రీవాల్. మొత్తమ్మీద తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి గర్వభంగం తప్పదనే అంచనాలున్నాయి.

First Published:  6 Dec 2022 9:51 PM IST
Next Story