Telugu Global
National

సార్వత్రిక ఫలితాలను కళ్లకు కట్టిన ఆ రెండు రాష్ట్రాలు..

ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో.. జాతీయ పార్టీలను ప్రజలు అస్సలు పట్టించుకోవడంలేదనే విషయం అర్థమవుతోంది.

సార్వత్రిక ఫలితాలను కళ్లకు కట్టిన ఆ రెండు రాష్ట్రాలు..
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కావాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రత్యేక కారణాలతో ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ ముందుగా జరిగింది. అయితే ఈ ఫలితాలు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీకి భారీ మెజార్టీ రాగా, సిక్కింలో ప్రాంతీయ పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా విజయభేరి మోగించింది.

బీజేపీ హ్యాట్రిక్..

అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం విశేషం. 60 స్థానాల అరుణాచల్ అసెంబ్లీలో ఇదివరకే 10 సీట్లను బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా, తుది ఫలితాల తర్వాత ఆ పార్టీ గెలిచిన స్థానాలు 46కి చేరుకున్నాయి. దీంతో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్టయింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలన్నీ ముక్త కంఠంతో చెబుతున్న వేళ.. అరుణాచల్ అసెంబ్లీ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రాంతీయ పార్టీల ప్రాభవం..

1984 తర్వాత జాతీయ పార్టీలకు అస్సలు అవకాశం ఇవ్వని సిక్కిం, ఈసారి కూడా అదే బాటలో నడిచింది. సిక్కిం క్రాంతికారి మోర్చా ఇక్కడ ఘన విజయం సాధించింది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాల్లో ఎస్కేఎం ఏకంగా 31 స్థానాలు గెలవడం విశేషం. సిక్కింలో బీజేపీ, కాంగ్రెస్ సాధించిన సీట్ల సంఖ్య సున్నా. అంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో.. జాతీయ పార్టీలను ప్రజలు అస్సలు పట్టించుకోవడంలేదనే విషయం అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పుకునే బీజేపీ అయినా సరే సిక్కింలో కనీసం బోణీ చేయలేని పరిస్థితి ఉంది.

బీజేపీ బలంగా ఉన్న చోట ఆ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతుండగా, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట.. ఎన్డీఏ కూటమి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని ఈ ఫలితాలు చెబుతున్నాయి.

First Published:  3 Jun 2024 12:18 AM GMT
Next Story