బీహార్: ఇలా మంత్రిగా ప్రమాణం చేశారో ..లేదో.. అరెస్ట్ వారంట్ రెడీ..
బీహార్ న్యాయ శాఖ మంత్రికి అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయ్యింది. ఓ కిడ్నాప్ కేసులో నిందితుడైన ఈయన ఆగస్టు 16 న సింగ్ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. కానీ ఆయన రాజ్ భవన్ కి వెళ్లి మినిష్టర్ గా ప్రమాణం చేసేశారు.
బీహార్ రాజకీయాలు అప్పుడే హాట్ హాట్ గా మారుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన కొత్త కేబినెట్ ని ఏర్పాటు చేసి కనీసం వారమైనా కాలేదు.. అసెంబ్లీలో తన మెజారిటీని ఇంకా నిరూపించుకోనే లేదు.. కానీ 'క్రిమినల్ పాలిటిక్స్' బయటపడ్డాయి. న్యాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్తికేయ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కిడ్నాప్ కేసుకు సంబంధించి నిన్న దానాపూర్ కోర్టులో సరెండర్ కావలసిన ఆయన.. ఇందుకు బదులు పాట్నాకు వెళ్లి నితీష్ నూతన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి చెందిన సింగ్.. 2014 లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో నిందితుడు.. ఈ కేసులో ఆయన అరెస్ట్ వారంట్ ను ఎదుర్కోవలసి ఉంది. ఈ వ్యవహారమేదీ తనకు తెలియదని సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై తనిప్పుడే వింటున్నానన్నారు. 2014 లో రాజీవ్ రంజన్ అనే ఓ బిల్డర్ ని హతమార్చాలన్న పన్నాగం పన్ని మొదట అతడిని కిడ్నాప్ చేయడానికి 11 మందితో కలిసి కార్తికేయ సింగ్ యత్నించారట. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అరెస్ట్ వారంటును జులై 14 న ఆయనకు జారీ చేశారు. ఆగస్టు 16 న సింగ్ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. కానీ ఆయన రాజ్ భవన్ కి వెళ్లి మినిష్టర్ గా ప్రమాణం చేసేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. తన పేరిట వారంట్ ఏదీ జారీ కాలేదని, ఎన్నికల అఫిడవిట్ లో తనకు సంబంధించిన సమాచారాన్నంతా ఇచ్చానని చెప్పారు. ఎన్నికల కమిషన్ నుంచి ఏ సమాచారాన్నీ దాచలేదు... అసలు ఏదీ నిరూపితమే కాలేదు అన్నారు.
ఆర్జేడీ ఎమ్మెల్సీ అయిన ఈయనపై పలు సెక్షన్ల కింద లోగడ పోలీసులు కేసు పెట్టారు. 2017 ఫిబ్రవరి 17 న కార్తికేయ సింగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని పాట్నా హైకోర్టు తోసిపుచ్చింది.. నితీష్ కుమార్ కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చేరిన సుధాకర్ సింగ్ మీద కూడా కేసులున్నాయి. 2013-14 లో జరిగిన బియ్యం స్కామ్ కేసులో ఈయనా నిందితుడే.. నాడూ అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వమే ఈయనపై కేసు పెట్టింది. అలాంటిది 'మచ్చ' పడిన ఇతడిని కేబినెట్ లోకి తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఆ నాడు రామ్ గఢ్ పోలీసు స్టేషన్ లో ఈయనపై ఎఫ్ ఐ ఆర్ దాఖలయింది. ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగులో ఉంది. కార్తికేయ సింగ్ పై అరెస్ట్ వారంట్ జారీ అయిందని, ఆయన కోర్టులో లొంగిపోవాల్సి ఉందని సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులను నితీష్ కుమార్ కేబినెట్ లో చేర్చుకోవడం ద్వారా బీహార్ ని తిరిగి లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోకి తీసుకుపోవడానికి యత్నిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. అసలు కార్తికేయ సింగ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.