రూ.2.5 కోట్లిస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను మోసగించబోయిన జవాన్ అరెస్ట్
మారుతి ధక్నే అనే జవాన్ ఇటీవల పూణేలో మహారాష్ట్ర శాసనసమండలి ప్రతిపక్ష నేత, శివసేన (యూబీటీ ) నేత దన్వేను కలిశాడు. మీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్ ఉపయోగించి, ఈవీఎంను మారుస్తానని, తనకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈవీఎంల పేరుతో రాజకీయ నాయకుడిని మోసగించేందుకు ప్రయత్నించిన ఓ జవాను కథ ఇది. ఈవీఎంలలో అమర్చే చిప్‌ను మీకు అనుకూలంగా మార్చేస్తానని, అందుకు రూ.2.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆ వ్యక్తిని సదరు నేత పోలీసులకు పట్టించాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిందీ ఘటన.
మారుతి ధక్నే అనే జవాన్ ఇటీవల పూణేలో మహారాష్ట్ర శాసనసమండలి ప్రతిపక్ష నేత, శివసేన (యూబీటీ ) నేత దన్వేను కలిశాడు. మీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్ ఉపయోగించి, ఈవీఎంను మారుస్తానని, తనకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దన్వే దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించడానికి స్కెచ్ వేశారు. మంగళవారం సాయంత్రం దన్వే సోదరుడు రాజేంద్ర.. మారుతిని ఓ హోటల్‌కు పిలిపించాడు. ప్లాన్‌లో భాగంగా కోటిన్నరకు డీల్ ఓకే చేసి నమ్మించేందుకు టోకెన్ కింద రూ. లక్ష ఇచ్చాడు. దన్వే ఇచ్చిన సమాచారంతో అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అప్పులు తీర్చేందుకు అడ్డదారి
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే.. జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భారీగా అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు ఇలా అడ్డదారిలో మోసాలకు పాల్పడేందుకు యత్నించాడని పోలీసులు చెప్పారు. అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.