మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై బీహార్ సీఎం ఫైర్
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుతో సహనం కోల్పోయిన నితీష్ కుమార్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం జరుగుతోంది.. ఎందుకు అలా అరుస్తున్నారు.. తాగి సభకు వచ్చారా? అని మండిపడ్డారు.
కల్తీ మద్యం తాగి సంభవించిన మరణాలపై బీహార్ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్రవాగ్వాదం నెలకొంది. దీంతో ఒక దశలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారా? అంటూ ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో 2016 నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉంది. అయితే మధ్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అక్రమ మద్యం, కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా బీహార్‌లో కల్తీ మద్యం తాగి మృతి చెంది వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగి 17 మంది మృతి చెందారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరా అవుతోందని, కల్తీ మద్యం, అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా నియంత్రించడంలో నితీష్ కుమార్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 17 మంది మృతి చెందడానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుతో సహనం కోల్పోయిన నితీష్ కుమార్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం జరుగుతోంది.. ఎందుకు అలా అరుస్తున్నారు.. తాగి సభకు వచ్చారా? అని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇటువంటి ప్రవర్తనను సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగి అసెంబ్లీకి వచ్చారా? అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. నితీష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ గతంలో ఎప్పుడూ నితీష్ ఇలా ప్రవర్తించ లేదన్నారు. ఇప్పుడు ఆయనకు వయసు పెరగడంతో పాటు ప్రజల్లో ఆదరణ కూడా తగ్గిపోయిందని విమర్శించారు. బీహార్ లో రాష్ట్రమంతటా మద్యం ఉన్నా దాన్ని ఎవరూ చూడలేరని వ్యాఖ్యానించారు. నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. నితీష్ కాలం ముగిసిపోయిందన్నారు. ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు ఉన్నారని, అందుకే తరచూ కోపం తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు.