కర్నాటక ఇక ఎన్ కౌంటర్ల రాజ్యం కాబోతుందా ?
కర్నాటకలో బీజేపీ కార్యకర్తల హత్య తర్వాత అక్కడ వాతావరణం ఆందోళనకరంగా మారింది. ఇక బుల్డోజర్ల రాజ్య తెస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే... మరో మంత్రి మరింత ముందుకెళ్ళి ఇక రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు జరుగుతాయని హెచ్చరించారు.
కర్ణాటకలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్వల్ప రోజుల వ్యవధిలో మూడు హత్యలు అందునా ఇద్దరు బిజెపి అనుబంధ సంఘ సభ్యులు కాగా, ఓ ముస్లిం యువకుడు ఉన్నారు. బిజెపి ఐటి విభాగానికి చెందిన ప్రవీణ్ నెట్టార్ హత్యానంతరం బిజెపి శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐటి విభాగంలో పనిచేసే ఎంతోమంది రాజీనామాలు చేశారు. ఎట్టకేలకు పార్టీ శ్రేణుల ఒత్తిడికి తలొగ్గి ఈ హత్య కేసును ఎన్ఐఎ కు అప్పగిస్తూ ముఖ్యమంత్రి బొమ్మై నిర్ణయం తీసుకున్నారు. అసరమైతే మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా' యోగి ఆదిత్యనాథ్ మోడల్‌ను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బొమ్మై ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపద్యంలో ఆయన మంత్రి వర్గ సహచరుడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ ఐదడుగులు ముందుకేసి.. "ఉత్తరప్రదేశ్ కంటే ఐదడుగులు ముందుకు" వెళ్లి నిందితులను లక్ష్యంగా చేసుకుని "ఎన్‌కౌంటర్లు" చేస్తామని హెచ్చరించారు. "వారిని అరెస్టు చేస్తారు కానీ ఇలాంటి ఘటనలు జరగకూడదనేది మా కార్యకర్తలు, ప్రజల కోరిక. వారి కోరిక మేరకు చర్యలు ఉంటాయి. దోషులను పట్టుకుంటాం, ఎన్‌కౌంటర్ జరిగినా, జరగకపోయినా మేము చేసేది చేస్తాము. ఈ విషయంలో యూపీ కంటే దూకుడుగా ముందుకెళ్ళి అక్కడ కంటే మెరుగైన మోడల్ ఇస్తాం.. కర్ణాటక ప్రగతిశీల రాష్ట్రం, మోడల్ రాష్ట్రమని, మనం ఎవరినీ అనుసరించాల్సిన అవసరం లేదని" మంత్రి అన్నారు.
మంగళవారం నాడు బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు నరికి చంపిన వెంటనే ఇటువంటి వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాగా, ఈ హత్యకు సంబంధించి అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిక్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని మంత్రి తెలిపారు. "యోగి మోడల్ అంటే నిందితులకు జైలు శిక్ష లేదా బుల్‌డోజర్‌లను ఉపయోగించి వారి ఇళ్లను ధ్వంసం చేయడం వంటి కఠినమైన చర్యలకు ప్రభుత్వం పాల్పడవచ్చు. అయితే అంతటితో ఆగకుండా మంత్రి అశ్వత్ నారాయణ్, ఎన్ కౌంటర్లంటూ మాట్లాడటం ప్రజలను భయపెట్టడానికేనా ?