Telugu Global
National

కేబుల్ వంతెనలు ప్రమాదకరమా?

కేబుల్ బ్రిడ్జిలు ప్రమాద కరమా ? గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన తర్వాత ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ స‌స్పెన్ష‌న్ వంతెన‌లు కొన్ని సంద‌ర్భాల్లో వాటి ఫ్లెక్సిబిలిటీ ని కోల్పోవ‌డం కానీ, స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కానీ ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

కేబుల్ వంతెనలు ప్రమాదకరమా?
X

గుజ‌రాత్ లో వంతెన ప్ర‌మాదం నేపథ్యంలో స‌స్పెన్ష‌న్ వంతెన‌ల సామ‌ర్ధ్యంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోర్బీలో ప్ర‌మాదానికి గురైన బ్రిడ్జ్ ఊగిస‌లాడే (సస్పెన్షన్ బ్రిడ్జి) త‌ర‌హా వంతెన అని దానిలో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలిసింది. సస్పెన్షన్ బ్రిడ్జ్‌లు సాధారణంగా కేబుల్స్ ద్వారా నిర్మిస్తారు. కొన్ని సమయాల్లో, ప్యాసింజర్ సస్పెన్షన్ వంతెనలకు గట్టి పునాది ఉండదని నిపుణులు చెబుతున్నారు .

ఈ స్పెన్ష‌న్ వంతెన‌లు కొన్ని సంద‌ర్భాల్లో వాటి ఫ్లెక్సిబిలిటీ ని కోల్పోవ‌డం కానీ, స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కానీ ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. అలాగే వంతెన‌పై ప‌డే భారం కూడా ప‌రిగ‌ణించాల్సి ఉంటుందంటున్నారు. దీని నియంత్ర‌ణ, నిర్వ‌హ‌ణ‌లో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. స‌క్ర‌మ నిర్వ‌హ‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా ప్ర‌మాదాల‌కు దారితీస్తుంద‌ని చెబుతున్నారు.

మోర్బీ బ్రిడ్జిపైకి భారీ సంఖ్యలో జనం రావడం వల్లే కూలిపోయిందని, దీంతో ఓవర్‌లోడింగ్‌ జరిగిందని ఇప్పటి వరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మ‌ర‌మ్మ‌తుల‌కు గురైన ఈ వంతెన ఉప‌యోగానికి అనువుగా ఉందా లేదా అనే ప‌రీక్ష‌లు ఏమీ చేయ‌లేద‌ని తెలుస్తోంది.

మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టిన సంస్థ సంబంధిత ఇంజ‌నీరింగ్ కంప‌నీ నుంచి ఫిట్ నెస్ స‌ర్టిఫికెట్ తీసుకొని ఉండొచ్చు కానీ దానిని మాకు స‌మ‌ర్పించ‌లేద‌ని స్థానిక మునిసిప‌ల్ అధికారి జ‌లా చెప్ప‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజా దుర్ఘ‌ట‌న‌కు ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కార‌ణ‌మని అక్క‌డి ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

మోర్బీలోని 143 ఏళ్ల ఐకానిక్ వంతెన పూర్వాప‌రాలు..

మోర్బీలోని 230 మీటర్ల చారిత్రక సస్పెన్షన్ వంతెనను మొదటిసారిగా ఫిబ్రవరి 20, 1879న అప్పటి ముంబయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించారు. అప్పట్లో దాదాపు రూ.3.5 లక్షల వ్యయంతో దీనిని పూర్తి చేశారు. ఆ రోజుల్లో యూరప్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించారు. మెటీరియల్ అంతా ఇంగ్లండ్ నుండి వచ్చింది. ఇది దర్బార్‌ఘర్ నుండి నాజర్‌బాగ్‌కు అనుసంధానం చేసేలా నిర్మించారు. దీని పొడవు సుమారు 765 అడుగులు.

ఈ వంతెనను గత రెండేళ్లుగా మూసివేశారు. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న తిరిగి తెరిచారు.

First Published:  31 Oct 2022 3:50 PM IST
Next Story