Telugu Global
National

ఆప్‌ నేతలు అర్బన్‌ నక్సలైట్లా?

తమని వ్యతిరేకించే వారిని, తమ భావజాలాన్ని తిరస్కరించేవారిని 'అర్బన్‌ నక్సలైట్లు' అంటూ ముద్ర వేయడం బిజెపికి పరిపాటిగా మారింది. ఇపుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ రాష్ట్రంలోకి అర్బన్‌ నక్సలైట్లు కొత్త ముఖాలతో, సరికొత్త అవతారంతో ప్రవేశిస్తున్నారని చెప్పడం ఇందుకు పరాకాష్ట.

ఆప్‌ నేతలు అర్బన్‌ నక్సలైట్లా?
X

తమని వ్యతిరేకించే వారిని, తమ భావజాలాన్ని తిరస్కరించేవారిని 'అర్బన్‌ నక్సలైట్లు' అంటూ ముద్ర వేయడం బిజెపికి పరిపాటిగా మారింది. ఇపుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ రాష్ట్రంలోకి అర్బన్‌ నక్సలైట్లు కొత్త ముఖాలతో, సరికొత్త అవతారంతో ప్రవేశిస్తున్నారని చెప్పడం ఇందుకు పరాకాష్ట. అమాయక ప్రజల్ని, శక్తివంతమైన యువతని పక్కదారి పట్టించేందుకు కొత్త అవతరాలతో ముందుకు వచ్చే అర్బన్‌ నక్సలైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మోడీ చెప్పిన మాటలు ఎవరిని ఉద్దేశించినవో తెలియంది కాదు. ఇటీవలి కాలంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలోకి శరవేగంగా దూసుకుపోతున్నది. బిజెపి పాలనా వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నది. ఆ పార్టీ అధినేత, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లో చేస్తున్న పర్యటనలకీ, చెబుతున్న మాటలకీ జనం ఆకర్షితులవుతున్నారు. మార్పు కోసం ఎదురుచూస్తున్న గుజరాత్‌ ప్రజలకు ఆప్‌ మీద ఆశలు పెరిగాయి. కాంగ్రెస్‌ కన్నా ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఇనుమడిరచాయి.

ఈ పరిణామాలు బిజెపి నేతలకీ, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి మింగుడు పడటం లేదు. జనం మీద తమ పట్టు జారిపోతున్న పరిస్థితిని గమనించిన కాషాయ పరివారం ఎదురుదాడికి దిగింది. రాజకీయంగా ఎదుర్కోలేక ఆప్‌ నేతలని 'అర్బన్‌ నక్సలైట్లు'గా ముద్ర వేయడం గమనార్హం. మోదీ తన ప్రసంగంలో ఆప్‌ పార్టీ పేరు ఎత్తలేదు కానీ ఆయన అంటున్న అర్బన్‌ నక్సలైట్లు ఆప్‌ నాయకులు, కార్యకర్తలేనని ఎవరూ చెప్పకనే అర్థమవుతుంది. వారిని ఉద్దేశించి మాత్రమే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని జాతీయ మీడియా స్పష్టంగా రాయడం గమనార్హం.

రాజకీయంగా ప్రత్యర్థులని ఎదుర్కోలేని బలహీనతకు మోదీ వ్యాఖ్యలు నిదర్శనం. ఆప్‌ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆ పార్టీ వారిని అర్బన్‌ నక్సలైట్లుగా ముద్ర వేయడం బిజెపి నాయకత్వ భావ దారిద్య్రాన్ని తెలియజేస్తున్నది. గతంలో అర్బన్‌ నక్సలైట్ల ముసుగులో ఉన్న పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనల కారణంగానే సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సకాలంలో పూర్తి కాలేదని మోదీ ఆరోపించారు. వాస్తవం మాత్రం ఇందుకు భిన్నం. డ్యామ్‌ నిర్మాణం కోసం నిధుల కేటాయింపులో అలసత్వం, నిర్మాణంలో జాప్యం, ప్రభుత్వానికి స్పష్టత కొరవడటం వంటి కారణాలున్నాయి. డ్యామ్‌ నిర్మాణాన్ని మేధాపాట్కర్‌ మొదలయిన పర్యావరణ ఉద్యమకారులు వ్యతిరేకించారు. కానీ డ్యామ్‌ నిర్మాణం వారి ఆందోళనల వల్ల ఆగలేదు. ఆ నిర్మాణంలో జాప్యానికి సైతం నాడు రాష్ట్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్న నిజాలు వెలుగు చూశాయి.

అయినప్పటికీ అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిన వారు తమ ప్రత్యర్థులనీ, తమని ప్రశ్నించిన వారినీ అర్బన్‌ నక్సలైట్లు అంటూ ముద్ర వేసి నోరు మూయించాలనుకునే దాష్టీకం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే మోదీ గుజరాత్‌ పర్యటనలో ఆమ్‌ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అర్బన్‌ నక్సలైట్లు అనే మాటని ప్రస్తావించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రచారం ఉండాలి. తమ అభిప్రాయాల్ని చెప్పే స్వేచ్ఛ ప్రతి పార్టీకి ఉంటుంది. మార్పును కోరుకునే హక్కు ప్రజలకీ ఉంటుంది. రెండు దశాబ్దాలుగా ఎలాంటి మార్పు లేని గుజరాత్‌లో ప్రజలు మార్పుని ఆశిస్తే అది వారి తప్పు ఎలా అవుతుంది? నిజంగా ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటున్నారో యోచించాలి. తమ పాలనా వైఫల్యాలు ఏమిటో గ్రహించాలి. అంతా సజావుగా ఉంటే అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పే మాటలు జనం ఎందుకు వింటున్నారో తెలుసుకోవాలి. ఆమ్‌ ఆద్మీ పార్టీ పునాదులు గుజరాత్‌లో బలపడటానికి కారణాలు ఏమిటో ఆకళింపు చేసుకోవాలి.

ఇందుకు భిన్నంగా ప్రత్యర్థుల మీద అర్బన్‌ నక్సలైట్లని ముద్ర వేసి జనాల్లో వారి విశ్వసనీయతని దెబ్బ తీయాలనుకోడం కుటిల రాజకీయ ఎత్తుగడ. గుర్తింపు కలిగిన ఒక రాజకీయపార్టీని, ఆ పార్టీ నేతలను నర్మగర్భంగానైనా సరే రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా చెప్పబోవడం దుస్సహసం, దుర్మార్గం. ముఖ్యంగా ఒక దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసంగతమైన మాటలు రావడం హర్షించదగిన పరిణామం కాదు.

నక్సలైట్లకు ఈ రాజ్యాంగ యంత్రం మీద నమ్మకం లేదనుకున్నప్పటికీ వారికి కూడా వారి అభిప్రాయాల్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. ఆ అభిప్రాయాలు తప్పయితే అవి ఎందుకు ఎలా తప్పో చెప్పడం ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీల బాధ్యత. కనుక ప్రధాన స్రవంతి పార్టీకి చెందిన వారిని అర్బన్‌ నక్సలైట్లుగా ముద్ర వేసి వారిని ప్రగతి వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా చెప్పబోవడం ఆమోదయోగ్యం కాదు. మోదీ మాటల్లోని అంతరార్థం, అసలు సారం గుజరాత్‌ ప్రజలు గ్రహించకపోరు. ఎన్నికల ఫలితాలు ఎలాగైనా ఉండవచ్చు గానీ ఎన్నికల సమరంలో నిజాల మీద నిలబడి మాట్లాడకపోతే ప్రజలు ఏవగించుకుంటారు. అత్యున్నత స్థాయిలో ఉన్నవారు హుందాతనం పాటించకపోతే జనం ముందు పలుచనవుతారు. ప్రజాస్వామ్యం పేరిట ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని అనుసరించే పద్ధతిని అంగీకరించరు. తమ మాటలతీరు, అబద్ధాల ప్రచారాన్ని కాషాయ పరివారం మార్చుకోకపోతే జనం ఏదో సమయాన తమదైన తీర్పు చెప్పకుండా ఉండరు.

First Published:  11 Oct 2022 9:00 AM IST
Next Story