ఎన్నికల కమిషనర్ల నియామకం..కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య తలెత్తుతున్న వివాదం
కేంద్ర ఎన్నికల కమిషన్ర్ల నియామకం వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్ (ఈసి))గా నియమించడానికి అనుసరించిన ప్రక్రియను సుప్రీంకోర్టు ప్రశ్నించింది . ఇందుకు సంబంధించిన ఆయన ఫైల్‌కు అత్యంత హడావిడిగా అనుమతులు లభించాయని పేర్కొంది.
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానానికి మధ్య వివాదం రగులుతున్నట్టు కనబడుతోంది. టిఎన్ శేషన్ లాంటి వ్యక్తి ఎన్నికల అధికారిగా ఉండాలని కోరుకుంటున్నట్టు, అటువంటి అధికారులను ఎంపిక చేసుకునేందుకు కొలిజియం తరహా వ్యవస్థ ఉండాలని డిమాండ్లు వస్తున్న విషయాన్ని నిన్న సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
గురువారం ఇదే విషయమై కొనసాగిన విచారణ సందర్భంగా అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్ (ఈసి))గా నియమించడానికి అనుసరించిన ప్రక్రియను సుప్రీంకోర్టు ప్రశ్నించింది . ఇందుకు సంబంధించిన ఆయన ఫైల్‌కు అత్యంత హడావిడిగా అనుమతులు లభించాయని పేర్కొంది.
" ఇలా ఎలా మదింపు చేసి క్లియర్ చేస్తారు..? అయినా, మేము అరుణ్ గోయెల్ అర్హతలను ప్రశ్నించడంలేదు .. అతని ఎంపిక కు జరిగిన ప్రక్రియను మాత్రమే ప్రశ్నిస్తున్నాం " అని జస్టిస్ కె .ఎం. జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్‌గా గోయెల్ నియామకానికి సంబంధించిన ఫైల్‌ను కేంద్రం ధర్మాసనం ముందు ఉంచింది.
"1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రోజే ఆయన ఫైలును న్యాయ మంత్రిత్వ శాఖ ఒకే రోజులో క్లియర్ చేసింది. గోయల్ తో కలిపి నలుగురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను ప్రధాని ముందు ఉంచి ఆయన అనుమతి తీసుకున్నారు ఆ వెంటనే 24 గంటల్లో రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించింది. " అని ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికల కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను కోరుతూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారిస్తోంది.