Telugu Global
National

భారత్ లో 'యాపిల్' కలకలం

విపక్ష ఎంపీలకు మాత్రమే ఆ హ్యాక్‌ అలర్ట్‌ మెసేజ్‌ లు ఎందుకు వచ్చాయనే విషయాన్ని మాత్రం యాపిల్ సంస్థ చెప్పలేకపోయింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో పలువురు ఐఫోన్‌ యూజర్లకు ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లు వచ్చినట్లు యాపిల్‌ వర్గాలు వెల్లడించాయి.

భారత్ లో యాపిల్ కలకలం
X

భారత్ లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. అయితే ఈసారి యాపిల్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుంచి హెచ్చరికలు వచ్చాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం విశేషం. యాపిల్ ఫోన్లు వాడుతున్న నేతలకు ఈ హెచ్చరికలు వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఉద్ధవ్ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా మరికొంతమందికి ఈ హెచ్చరికలు వచ్చాయి. యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌.. ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు యాపిల్‌ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

అలర్ట్ మెసేజ్ తో వెంటనే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత దాడి అని ప్రత్యేకంగా తమకు వచ్చిన హెచ్చరికల్లో ఉందని, ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని మండిపడ్డారు. యాపిల్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ లను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విపక్ష ఎంపీలు, నేతలపై కేంద్రం నిఘా పెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రశ్నించేవారి నోళ్లు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, అదానీ కోసమే ఫోన్‌ ట్యాంపింగ్‌ లు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్‌ ట్యాంపింగ్‌ లకు భయపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్‌ ఇస్తానని, తీసుకోవాలని సవాల్‌ విసిరారు.

కేంద్రం స్పందన ఏంటంటే..?

ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవి అని కొట్టిపారేసింది. యాపిల్‌ సంస్థను వివరణ కోరాలని, కంపెనీ స్పందనపై అసంతృప్తిగా ఉంటే పోలీస్ కేసు పెట్టాలని ప్రతిపక్ష నేతలకు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఐటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీకి స్వయంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చైర్మన్‌గా ఉన్నారని, ఈ విషయంలో యాపిల్ కంపెనీని ఎందుకు వివరణ కోరడం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

యాపిల్ వివరణ..

యాపిల్ మెసేజ్ లు సంచలనం సృష్టించడంతో ఆ సంస్థ వెంటనే స్పందించింది. హ్యాకింగ్‌ ప్రయత్నాలేవీ తమ ఫోన్లలో జరగలేదని తేల్చి చెప్పింది. అలాంటి నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ అలర్ట్‌ లు కూడా కావొచ్చని పేర్కొంది. హ్యాకర్లు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు అవలంబిస్తారని తెలిపింది. అయితే విపక్ష ఎంపీలకు మాత్రమే ఆ హ్యాక్‌ అలర్ట్‌ మెసేజ్‌ లు ఎందుకు వచ్చాయనే విషయాన్ని మాత్రం యాపిల్ సంస్థ చెప్పలేకపోయింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో పలువురు ఐఫోన్‌ యూజర్లకు ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లు వచ్చినట్లు యాపిల్‌ వర్గాలు వెల్లడించాయి.

First Published:  31 Oct 2023 11:39 AM GMT
Next Story