Telugu Global
National

జమ్ముకశ్మీర్‌ కొత్త డీజీపీగా ఏపీ కేడర్‌ ఐపీఎస్‌

1968లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్‌ ప్రభాత్‌.. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఎంఏ చేశారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు.

జమ్ముకశ్మీర్‌ కొత్త డీజీపీగా ఏపీ కేడర్‌ ఐపీఎస్‌
X

జమ్ముకశ్మీర్‌ కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఆర్‌ఆర్‌ స్మైన్‌ పదవీ కాలం సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. గత 11 నెలలుగా ఆయన అక్కడ డీజీపీగా కొనసాగుతున్నారు.

నళిన్‌ ప్రభాత్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌గా ఎంపికైనప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌– గోవా–మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం కేడర్‌కి అతని డిప్యుటేషన్‌ని కేంద్రం ఆమోదించింది. ఆయన ప్రస్తుతం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌కి అధిపతిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌ 30 వరకు జమ్ముకశ్మీర్‌లో స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఓ)గా నియమితులయ్యారు. అక్టోబర్‌ 1న డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్‌ 30లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మరో వారం, పది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడం, ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం, అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగానే నళిన్‌ ప్రభాత్‌ను కేంద్రం జమ్ముకశ్మీర్‌కు పంపిన‌ట్లు తెలుస్తోంది.

1968లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్‌ ప్రభాత్‌.. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఎంఏ చేశారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎస్పీగా నళిన్‌ ప్రభాత్‌ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. మూడు పోలీసు గ్యాలంట్రీ మెడల్స్‌ కూడా అందుకున్నారు. వీటితో పాటు పరాక్రమ్‌ పతక్‌ (విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్‌ సురక్ష పతకం సహా అనేక మెడల్స్‌ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. సుదీర్ఘకాలం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హెూదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది.

First Published:  16 Aug 2024 5:44 AM GMT
Next Story