Telugu Global
National

భయం వద్దు.. జీతాలు పెరుగుతాయి

అంతర్జాతీయ మాంద్యం భయాలు, దేశీయంగా అధిక ద్రవ్యోల్బణం లాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత్‌ లో వేతనాలు 10.4 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

భయం వద్దు.. జీతాలు పెరుగుతాయి
X

దేశంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. డాలర్ తో రూపాయి మారక విలువ తగ్గిపోవడంతో దేశీయ కంపెనీలన్నీ లాభాల బాట పట్టలేకపోతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాల పెంపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు జీతాలు పెరగకపోతే కుటుంబం గడిచేదెట్టా అని సగటు ప్రైవేటు ఉద్యోగి సతమతమవుతున్న తరుణంలో ఎయాన్ పీఎల్సీ సర్వే ఆసక్తిగా మారింది. 2023లో దేశీయ కార్పొరేట్ రంగం వృద్ధి నమోదు చేస్తుందని ఆ సర్వే తేల్చింది. ఉద్యోగుల జీతాలు 10.4 శాతం మేర పెరిగే అవకాశముందనేది సర్వే సారాంశం.

ఈ కామర్స్ రంగంలో అత్యథికం..

వేతన పెంపు అధికంగా ఉండే అవకాశమున్న రంగాల్లో ఐదింటిలో నాలుగు, సాంకేతికతకు సంబంధించినవే కావడం విశేషం. అత్యధికంగా ఈ కామర్స్ రంగంలో వచ్చే ఏడాది 12.8 శాతం మేర జీతాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత స్టార్టప్ కంపెనీలలో 12.7 శాతం జీతాలు పెరగొచ్చు. ఐటీ కంపెనీల్లో 11.3 శాతం, ఆర్థిక సేవల రంగంలో ఉన్న కంపెనీల్లో 10.7 శాతం మేర జీతాలు పెరిగే అవకాశముంది.

2022 తొలి ఆరు నెలల కాలంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగుల వలసల రేటు 20.3 శాతంగా ఉంది. అందుకే వేతనాలపై ఒత్తిడి కొనసాగుతోందని సర్వే చెబుతోంది. ఈ ఏడాది చివరి వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. 40 రంగాలకు చెందిన 1,300 కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించి ఎయాన్ పీఎల్సీ సంస్థ ఈ నివేదిక రూపొందించింది. అంతర్జాతీయ మాంద్యం భయాలు, దేశీయంగా అధిక ద్రవ్యోల్బణం లాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత్‌లో వేతనాలు 10.4 శాతం పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

First Published:  27 Sept 2022 12:42 PM IST
Next Story