'మోడీజీ, చేయిదాటిపోయింది, నాలుగేళ్ళ క్రితం ఆ మాటలు చెప్పాల్సింది'
మోడీ బీజేపీ నేతలకు కార్యకర్తలకు ఇచ్చిన పిలుపుపై ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ స్పందించారు. ముంబైలో జరిగిన తన తదుపరి చిత్రం 'ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబ్బత్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ మధ్య కాలంలో సినిమాలను బైకాట్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపులు ఓ ట్రెండ్ గా మారిపోయాయి. బీజేపీ నాయకులు ఈ ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తూ కొన్ని సినిమాలకు వ్యతిరేకంగా బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ప్రధాని మోడీ బీజేపీ నాయకులను ఉద్దేశించి, ఇకపై సినిమాల గురించి అనవసరంగా మాట్లాడకండి. అనవసర ప్రచారం చేసి రచ్చ సృష్టించకండి అంటూ పిలుపునిచ్చారు.
మోడీ బీజేపీ నేతలకు కార్యకర్తలకు ఇచ్చిన పిలుపుపై ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ స్పందించారు. ముంబైలో జరిగిన తన తదుపరి చిత్రం 'ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబ్బత్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
''మోడీజీ ఈ మాటలు నాలుగేళ్ళక్రితం చెప్పాల్సింది. ఇప్పుడు ఏం చెప్పినా ఉపయోగంలేదు. ఇప్పుడు దాని వల్ల ఎలాంటి మార్పు వస్తుందని నేను అనుకోను.ఇప్పుడు విషయాలు చేయి దాటిపోయాయని నేను అనుకుంటున్నాను, ఎవరూ ఎవరి మాట వినరు. ఇంత కాలం మీరు మూగ ప్రేక్షకుడిలా ఉండి పక్షపాతాన్ని శక్తివంతం చేశారు. మీరు నిశ్శబ్దంగా ఉండి ద్వేషాన్ని శక్తివంతం చేశారు. ఇప్పుడు పక్షపాతం, ద్వేషంతో వాళ్ళంతట వాళ్ళు శక్తివంతమైపోయారు. అది వారికిప్పుడు బలంగా మారింది, ఆ గుంపు అదుపు తప్పుపోయింది.” అన్నారాయన.
కాగా ఈ చిత్ర నిర్మాత షరీక్ పటేల్ మాత్రం మోడీ ప్రకటనను స్వాగతించారు. ''ప్రధాని అటువంటి ప్రకటన చేసినందుకు మేము సంతోషిస్తున్నాము. బైకాట్ పిలుపులు కనీసం నెమ్మదించగలవని నేను ఆశిస్తున్నాను.'' అని అన్నారు.