పిల్లలు పుట్టింది దుబాయ్ లో.. నయనతార సరోగసీ వివాదంలో మరో ట్విస్ట్
నయనతార సరోగసీ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. వివరాలను రేపు ప్రభుత్వానికి ఈ కమిటీ అందించబోతోంది.
నయనతార సరోగసీ వివాదంలో రేపు కీలక పరిణామం జరగబోతోంది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తమ విచారణ పూర్తిచేసింది. విచారణ వివరాలను రేపు తమిళనాడు ప్రభుత్వానికి ఈ కమిటీ అందించబోతోంది. నయనతార, విఘ్నేష్ దంపతుల సరోగసీ చట్టబద్ధంగానే జరిగినట్టు వారు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటున్నారు.
నయనతార, విఘ్నేష్ దంపతులు పెళ్లైన నాలుగు నెలలకే తమకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో వివాదం మొదలైంది. సహజ పద్ధతుల్లో పిల్లలు పుట్టడం నాలుగు నెలల్లో అసాధ్యం. అంటే నయనతార దంపతులు సరోగసీ ద్వారా కవల పిల్లలను స్వీకరించి ఉంటారని తేలిపోయింది. అయితే సరోగసీ విషయంలో భారత్ లో కఠిన నిబంధనలున్నాయి. దీంతో నయనతార దంపతులు కార్నర్ అయ్యారు. అయితే ఆ వెంటనే వారినుంచి వివరణ కూడా వచ్చింది.
ఆరేళ్ల క్రితమే పెళ్లి..
సరోగసీ వివాదం మొదలైన తర్వాత నయనతార ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. విఘ్నేష్ తో తనకు ఆరేళ్ల క్రితమై పెళ్లయిందని చెప్పారు. భారత్ లో ఉన్న చట్టాల ప్రకారం పెళ్లైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టని దంపతులు సరోగసీని ఆశ్రయించవచ్చు. ఆరేళ్ల క్రితమే పెళ్లయింది అంటున్నారు కాబట్టి, నయనతార దంపతులు ఒడ్డునపడ్డట్టేనని తెలుస్తోంది. అయితే అనారోగ్య సమస్యలపై డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఉండాలంటున్నారు. ఇది కూడా వారికి చిటికెలో పని.
ఇక్కడ సరోగసీ వివాదాన్ని పూర్తిగా పక్కనపెట్టేందుకు నయనతార, విఘ్నేష్ దంపతులు మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. కవల పిల్లలు దుబాయ్ లో పుట్టారని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పత్రాలను కమిటీకి అందించారు. నయనతార స్నేహితురాలి ద్వారా ఈ బిడ్డలు కలిగారని, దుబాయ్ లోనే పిల్లలు పుట్టారని చెప్పారు. సో.. పిల్లలు దుబాయ్ లో పుట్టారు కాబట్టి ఇక భారత చట్టాలతో ఇబ్బందులుండవు. పోనీ ఇక్కడ చట్టాలు వర్తించినా నయనతార ఆరేళ్ల క్రితం రికార్డులు కూడా పక్కాగా సమర్పించారు కాబట్టి అసలు సమస్యే లేదు. దీంతో నయనతార, విఘ్నేష్ పై చర్యలకు అవకాశం లేదని అంటున్నారు. ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సమర్పించే నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టం చేయబోతున్నట్టు తెలుస్తోంది.