Telugu Global
National

మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న యూపీ సీఎం.. ఆగస్టు 15 సెలవు రద్దు

ఈ ఏడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మార్కెట్‌లు మూసివేయబడవని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న యూపీ సీఎం.. ఆగస్టు 15 సెలవు రద్దు
X

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆగస్టు 15 ను తమ రాష్ట్రంలో సెలవు దినంగా పరిగణించబోమని.. యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. యోగి నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి యోగీది వివాదాల బాటే. రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతులు అవలంభిస్తుంటారని.. నియంతృత్వ పోకడలతో ముందుకు వెళ్తుంటారని విపక్షాలు ఆయన మీద ఆరోపణలు గుప్పిస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

వచ్చే ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు సెలవును రద్దు చేస్తూ సీఎం యోగి నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మార్కెట్‌లు మూసివేయబడవని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా జరగడం దేశంలో 75 ఏళ్లలో ఇదే తొలిసారి.

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అవుతున్నందున ప్రతి జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ఎప్పటిలాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా.. ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే సెలవు రద్దు చేసినట్లు యోగి ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రజలు, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

First Published:  17 July 2022 6:27 PM IST
Next Story