బోంబే IIT లో మరో 'రోహిత్ వేముల' ఆత్మహత్య!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 18 ఏళ్ల దర్శన్ సోలంకి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూడున్నర నెలల క్రితమే అతడు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు.
ఫిబ్రవరి 12, ఆదివారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)-బొంబాయిలో మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 18 ఏళ్ల దర్శన్ సోలంకి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూడున్నర నెలల క్రితమే అతడు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. అయితే అతను దళితుడా కాదా అనే విషయం స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు.
సీనియర్ ముంబై పోలీసు అధికారి మాట్లాడుతూ, “విచారణ జరుగుతోంది, కారణం ఇంకా అనిశ్చితంగా ఉంది. పోస్టుమార్టం నిర్వహించి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు నివేదిక సమర్పించారు. వాస్తవాలను తెలుసుకోవడానికి మేము హాస్టల్ లోని ఇతర విద్యార్థులతో మాట్లాడుతున్నాము.'' అని తెలిపారు.
అయితే ''ఇది వ్యక్తిగత సమస్య వల్ల జరిగిన ఆత్మహత్య కాదు. ఇది సంస్థాగత హత్య" అని IIT బొంబాయిలోని విద్యార్థి సంఘం అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ (APPSC) ఆరోపించింది. దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థులకు ఇక్కడ స్థానం లేకుండా పోతోంది. వారి పట్ల దారుణమైన వివక్ష కొనసాగుతోంది అని ఆ సంఘం మండిపడింది. సోలంకి దళిత వర్గానికి చెందినవాడు కాబట్టే ఆయనకు ఈ స్థితి వచ్చింది అని APPSC పేర్కొంది.
ఇన్స్టిట్యూట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఫల్గుణి బెనర్జీ మాట్లాడుతూ, "ఇన్స్టిట్యూట్ ఒక తెలివైన విద్యార్థిని కోల్పోయినందుకు సంతాపం తెలియజేస్తున్నాం" మరణించిన విద్యార్థి తల్లిదండ్రులు అహ్మదాబాద్ నుండి వచ్చారు. వారు పూర్తి షాక్ స్థితిలో ఉన్నారని తెలిపారు.
.
“సోలంకి చాలా కామ్ గా ఉండే వ్యక్తి. అతనికి కోపం రావడం మేం ఎప్పుడూ చూడలేదు. అతను తన అసైన్‌మెంట్‌లను సమయానికి పూర్తి చేసేవాడు. మా విభాగంలో 12 మంది ఉన్నారు. అతను అంతర్ముఖుడు, కానీ మేము కలిసి తిరిగేటప్పుడు, అతను సరదాగా ఉండేవాడు, ”అని సోలంకి స్నేహితుడు చెప్పాడు.
తన పేరు చెప్పడానికి నిరాకరించిన APPSC సభ్యుడొకరు మాట్లాడుతూ, "మొదటి సంవత్సరం విద్యార్థులకు, ప్రత్యేకించి వారు మైనారిటీ కమ్యూనిటీలకు చెందినట్లయితే, ఇక్కడ వారి పట్ల దారుణమైన వివక్ష ఉంటుంది.'' అన్నారు.
"తాము అర్హత లేనివారమని, రిజర్వేషన్ల కారణంగా మాత్రమే IITలో సీటు పొందామని అవహేళనలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా, SC / ST / OBC వర్గాలకు చెందిన విద్యార్థులు తరచుగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు" అని APPSC సభ్యుడు చెప్పారు.
4 సెప్టెంబర్ 2014న IITబోంబే హాస్టల్‌లోని ఆరవ అంతస్తు నుండి పడి మరణించిన అనికేత్ ఆంబోర్ ఉదంతాన్ని కూడా APPSC విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
ఆ ప్రకటనలో, ఆంబోర్ మరణం "వివక్ష వాతావరణం" వల్లే జరిగిందని ఆ విద్యార్థి సంఘం ఆరోపించింది.
How many more Darshans and Anikets need to die? Our statement on the institutional murder of Darshan Solanki. We owe a collective responsibility towards the family of the deceased. As a society, as an institution, what do we celebrate and what do we marginalize? pic.twitter.com/K5lCD2mRl4
— APPSC IIT Bombay (@AppscIITb) February 13, 2023
సోలంకి మృతికి సంతాపంగా ఆదివారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు క్యాండిల్-లైట్ మార్చ్ నిర్వహించారు. క్యాండిల్ లైట్ మార్చ్‌కు ముందు విద్యార్థులు పంపిణీ చేసిన పోస్టర్ ఇలా ఉంది:
మరో వైపు బోంబే IIT లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడంలో విఫలమైనందుకు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది.
గత ఏడాది జూన్‌లో ఈ విషయమై బోంబే IITలోని APPSC విద్యార్థుల బృందం కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
31 జనవరి 2023 నాటి నోటీసులో, "కమీషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం తనకు అందించబడిన అధికారాల తో ఈ అంశంపై దర్యాప్తు/విచారణ చేయాలని నిర్ణయించింది." అని పేర్కొంది.
గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న వివక్షను భరించలేక దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. ఆ సంఘటన దేశ వ్యాప్త నిరసనలకు దారి తీసింది. దేశంలో ప్రముఖ యూనివర్సిటీల్లో, ప్రముఖ ఇన్స్టిట్యూట్ల లో కూడా దళిత, ఆదివాసీ విద్యార్థులకు ఎదురవుతున్న వివక్ష , హేళనలు...ఇలా ఎంత కాలం? తమ జ్ఞానంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన విద్యార్థులు ఇలా కుల దుర్మార్గాలకు బలవుతున్నా పాలకులకు పట్టదా ? సమాజం పట్టించుకోదా ? 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతం ఇంకా కులాలను, కుల వివక్షలను పెంచి పోషించడం సిగ్గుపడాల్సిన అంశంగా అనిపించడంలేదా ?