Telugu Global
National

ఇవాళే ప్రారంభమైన మరో అద్భుతమైన‌ రామ మందిరం

ఆలయ గర్భగుడి 65 అడుగుల ఎత్తులో ఉంది. ప్రధాన ఆలయం చుట్టూ సూర్య భగవానుడు, శివుడు, గణేశుడు, ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి.

ఇవాళే ప్రారంభమైన మరో అద్భుతమైన‌ రామ మందిరం
X

ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇవాళ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే ఇదే రోజు అయోధ్య రామాలయంతో పాటు ఒడిశాలో మరో అతి పెద్ద రామ మందిరం ప్రారంభం అయ్యింది. నయాఘఢ్ లోని ఫతేఘఢ్ గ్రామంలో 73 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహ ఆవిష్క‌ర‌ణ ఉత్స‌వంలా జరిగింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఫతేఘఢ్ లో కూడా ఇవాళే రామ మందిరాన్ని ఎంతో వైభవంగా ప్రారంభించారు.

ఫతేఘఢ్ లోని పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన్ చెట్టును ఫతేఘఢ్ నుంచి సేకరించారు. దీనిని స్మరించుకునేందుకోసం గ్రామంలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

గ్రామస్తులు ట్రస్ట్ గా ఏర్పడి భక్తుల నుండి విరాళాలు సేకరించారు. ఆలయ నిర్మాణంలో సగం ఖర్చు గ్రామస్తులే భరించారు. ఫతేఘఢ్ లో నిర్మించిన రామాలయం ఎత్తు 165 అడుగులు. 2017లో ఈ ఆలయ పనులు ప్రారంభం కాగా.. 150 మందికి పైగా కార్మికులు ఏడేళ్లపాటు కష్టపడి ఈ మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఫతేఘఢ్ లో సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఓ కొండపై ఈ ఆలయాన్ని నిర్మించారు. కోణార్క్ లో కనిపించే సాంప్రదాయ ఒడియా వాస్తు శిల్పం ప్రకారం ఈ ఆలయం నిర్మించబడింది.

ఆలయ గర్భగుడి 65 అడుగుల ఎత్తులో ఉంది. ప్రధాన ఆలయం చుట్టూ సూర్య భగవానుడు, శివుడు, గణేశుడు, ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. అయోధ్య ఆలయంతో పాటు ఫతేఘఢ్ లో నిర్మించిన ఈ రామ మందిరాన్ని కూడా ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించడంతో ఈ ఆలయం కూడా పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందని అంతా భావిస్తున్నారు.

First Published:  22 Jan 2024 6:11 PM IST
Next Story