Telugu Global
National

ఇస్రో మరో మైలురాయి.. గగన్‌యాన్ టీవీ - డీ1 పరీక్ష సక్సెస్

ఉదయం 10 గంటలకు శ్రీహరికోట నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ టీవీ డీ-1 రాకెట్ నింగిలోకి వెళ్లింది.

ఇస్రో మరో మైలురాయి.. గగన్‌యాన్ టీవీ - డీ1 పరీక్ష సక్సెస్
X

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే గగన్‌యాన్‌కు సంబంధించి ఇస్రో చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం అయ్యింది. నింగిలోకి వ్యోమగాములను పంపే దేశాలు అతి తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇస్రో చేపడుతున్న గగన్‌యాన్‌పై అందరికీ ఆసక్తి నెలకొన్నది. వ్యోమగాములను తీసుకొని వెళ్లే క్రూ మాడ్యుల్, ఎస్కేప్ సిస్టమ్ పని తీరును తాజాగా ఇస్రో పరీక్షించింది. గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 (టీవీ - డీ1) రాకెట్ టెస్ట్ లాంఛ్ విజయవంతంగా ముగిసింది.

షెడ్యూల్ ప్రకారం టీవీ - డీ1 రాకెట్‌ను ఇవ్వాళ ఉదయం 8.45 నిమిషాలకు ప్రయోగించాల్సి ఉన్నది. అయితే సాంకేతిక లోపంతో చివరి క్షణంలో నిలిచిపోయింది. ఇస్రో సైంటిస్ట్‌లు సాంకేతిక సమస్యను కనిపెట్టి వెంటనే సరి చేశారు. దీంతో తిరిగి ఉదయం 10 గంటలకు రాకెట్ లాంఛింగ్ ప్రయోగం జరిగింది.

ఉదయం 10 గంటలకు శ్రీహరికోట నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ టీవీ డీ-1 రాకెట్ నింగిలోకి వెళ్లింది. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశారు. ఇక 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యుల్, క్రూ మాడ్యుల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు తెరుచుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో పడింది.

గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించిన టీవీ - డీ1 రాకెట్ పరీక్ష విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగామని చెప్పారు. కాగా, గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నది. మూడు రోజుల తర్వాత వారిని తిరిగి భూమిపైకి తీసుకొని రానున్నది.

వ్యోమగాములతో నిండిన వాహక నౌక నింగిలోకి వెళ్లిన తర్వాత సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైతే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే వాళ్లు కూర్చునే క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరు చేసి.. సురక్షితంగా కిందకు తీసుకొని రావాలి. దీన్నే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటారు. దాన్నే ఇవ్వాళ ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.


First Published:  21 Oct 2023 5:31 AM GMT
Next Story