సినిమా హాళ్లు కాదు సామీ.. ప్రాణాలు పోతున్నాయ్ చూడండి..
ఆగస్ట్ 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో పనిచేసే సునీల్ కుమార్ అనే పండిట్‌ను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే జిల్లాలో మరో పండిట్ ఉగ్ర తూటాలకు బలయ్యాడు.
ఇటీవల కాశ్మీర్‌లో సినిమా హాళ్లు ప్రారంభించి చంకలు గుద్దుకుంది కేంద్రం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడిపోయాయని, ఇది ప్రధాని మోదీతోనే సాధ్యమైందని అంటున్నారు భక్తులు. అంతే కాదు, అక్కడ సినిమా హాళ్లు, ఇతర వ్యవహారాలు అన్నీ చక్కబడిపోయాయని, అసలు కాశ్మీర్‌లో మళ్లీ పాత పరిస్థితిలు వచ్చేశాయని అన్నారు కేంద్ర మంత్రులు. అయితే కాశ్మీర్ పరిస్థితుల్లో అసలేమాత్రం మార్పు లేదని ప్రస్తుత సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా స్థానికేతరులపై జరిగిన దాడిలో మరో వ్యక్తి మృతి చెందాడు.
ఆ మధ్య కాశ్మీర్‌లో ఓ బ్యాంక్ ఉద్యోగి, మరో మహిళా టీచర్ ఉగ్ర మూకల దాడులకు బలయ్యారు. సాధారణ పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. ఇటీవల కొంతకాలంగా ఈ దాడులు తగ్గడంతో కేంద్రం మళ్లీ తన ప్రతిభాపాఠవాల గురించి గొప్పగా చెప్పుకుంటోంది. అయితే సడన్ గా మళ్లీ కాశ్మీర్‌లో దాడులు జరిగాయి. కాశ్మీర్ పండిట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. షోపియాన్ జిల్లాలోని చౌధరీ గుండ్ ప్రాంతంలో జరిగిన దాడిలో పురాన్ కృష్ణ భట్ అనే కాశ్మీరీ పండిట్‌ని కాల్చి చంపారు ఉగ్రవాదులు.
ఉగ్రవాదుల కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు భట్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపారు బంధువులు. అతనికి ఉగ్రవాదులంటే భయమని, ఇటీవల ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడిపోయేవాడని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇలా ఉగ్రమూకల తూటాలకు బలికావడం యాదృచ్ఛికం అంటున్నారు. ఆగస్ట్ 16న షోపియాన్ జిల్లాలోనే ఆపిల్ తోటలో పనిచేసే సునీల్ కుమార్ అనే పండిట్‌ను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే జిల్లాలో మరో పండిట్ ఉగ్ర తూటాలకు బలయ్యాడు. ఈ దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పండిట్లు డిమాండ్లు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పండిట్లు పెట్టేబేడా సర్దుకుని వలస వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం వారికి నచ్చజెప్పి అక్కడే ఉంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఫలితం లేదు. పండిట్లు పిట్టల్లా రాలిపోతున్నారు.