40 పర్సెంట్ కమీషన్.. కర్నాటకలో కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు
బిల్లులు మంజూరు కాకపోవడంతో ప్రసాద్ తన ఇంటిని కూడా అమ్మేసుకున్నారని.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోందని తనతో ప్రసాద్ చెప్పారని వివరించారు.
కర్నాటకలో 40 పర్సెంట్ కమీషన్ దెబ్బకు కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు అల్లాడిపోతున్నారు. ఇదివరకే పెద్ద ఎత్తున బెంగళూరు ప్రముఖులు ఈ కమీషన్ పై ప్రధాని మోడీకి లేఖలు రాశారు. సెప్టెంబర్‌లోనే ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ కూడా పీఎంకు లేఖ రాశారు. గత ప్రభుత్వాల్లోనూ కమీషన్ తీసుకునే వారు కానీ అప్పుడు అది 5 నుంచి 10 శాతం ఉండేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చాక అది ఏకంగా 40 శాతానికి చేరిందని గతంలో వివరించారు. కర్నాటకను ఈ అవినీతి నుంచి కాపాడాలని కోరారు. ఆ తర్వాత పలు కాంట్రాక్టర్ల సంఘాలు కూడా పీఎంకు లేఖలు రాశాయి. కానీ కమీషన్ మాత్రం కట్టడి కాలేదు.
ఇప్పుడు మరో కాంట్రాక్టర్ 40 శాతం కమీషన్ ఇచ్చుకోలేక, బిల్లులు మంజూరు కాక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తుమకూరుకు చెందిన టీఎన్ ప్రసాద్.. 16 కోట్ల రూపాయల విలువైన సివిల్ పనులు చేశారు. అందుకోసం భారీగా అప్పు తెచ్చారు. పనులను పూర్తి చేసి నెలల గడుస్తున్నా బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. అందుకు కారణం 40 శాతం కమీషన్ ఇవ్వకపోవడమేనని చెబుతున్నారు.
ఈ విషయాన్ని కర్నాటక సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్‌రాం కూడా ధృవీకరించారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో ప్రసాద్ తన ఇంటిని కూడా అమ్మేసుకున్నారని.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోందని తనతో ప్రసాద్ చెప్పారని వివరించారు. తాను పనులు చేసిన ప్రభుత్వ బంగ్లాలోనే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఏప్రిల్ నెలలో అప్పటి మంత్రి ఈశ్వరప్ప కమీషన్ కోసం వేధిస్తున్నారంటూ కాంట్రాక్టర్ సంతోష్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పట్లో ఈశ్వరప్పపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్ చిట్ కూడా ఇచ్చేశారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్నాటకలో ఇలా అవినీతి విలయతాండవం చేస్తున్నా ప్రధాని దృష్టికి అనేక మంది తీసుకెళ్లినా అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.