Telugu Global
National

కర్ణాటకలో మరో వివాదం: హలాల్ Vs ఝట్కా కట్

కర్నాటకలో హిందుత్వ గ్రూపులు మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. దసరా సందర్భంగా ముస్లింల షాపుల్లో మాంసాన్ని కొనొద్దని, హిందువుల షాపుల్లోనే కొనాలని హిందూ గ్రూపులు ప్రచారం చేస్తున్నాయి.

కర్ణాటకలో మరో వివాదం: హలాల్ Vs ఝట్కా కట్
X

క‌ర్ణాట‌క‌లో మ‌త మౌఢ్యం ప‌రాకాష్ట‌కు చేరుకుంటూ సామాజిక సామ‌ర‌స్యానికి విఘాతం క‌లిగిస్తోంది. నగరంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కోరుతూ హిందూ కార్యకర్తలు ప్రచారాన్ని ప్రారంభించడంతో కర్ణాటకలో ఇది హలాల్ వర్సెస్ ఝట్కా కట్ (మాంసం కోసం జంతువులను చంపే హిందూ పద్ధతి) వివాదంగా మారింది. .

దక్షిణ కర్ణాటకలో పండుగల సమయంలో కుటుంబ పూర్వీకులకు మాంసాహారం అందించే ఆచారం ఉంది. ప్రజలు కూడా మాంసాహారం తింటారు. ఉత్సవాల సమయంలో మాంసాన్ని హిందువుల దుకాణాల్లోనే కొనాలని హిందూ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించి సోమవారం హిందూ నేతల సమావేశం నిర్వహించి ఈమేర‌కు నిర్ణ‌యించిన‌ట్టు హిందూ కార్యకర్త, హైందవి మార్ట్ యజమాని మునే గౌడ వివరించారు. ఝ‌ట్కా కట్ (మాంసం కోసం జంతువులను చంపే హిందూ పద్ధతి) ప్రచారాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు.

''పోయినసారి ఝ‌ట్కా కట్‌ని మాత్రమే ఉపయోగించాలని, హలాల్ కట్ మాంసాన్ని నిషేధించాలని పిలుపునిస్తే, ప్రజలు బాగా స్పందించ‌డంతో అది మంచి విజయాన్ని సాధించింది. హిందువులు మేల్కొన్నారు. సోమవారం నుంచి ఇంటింటికి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నాము'' అని ఆయ‌న‌ వివరించారు.

ఝ‌ట్కా కోసిన మాంసాన్ని మాత్రమే ఉపయోగించాలని, హిందూ దుకాణాల నుండి మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాలనే ప్రచారాన్ని కూడా సోషల్ మీడియాలో, దేవాలయాల దగ్గర చేస్తామని ఆయన చెప్పారు.

" మీరు తీసుకునే ఆహారాన్ని నా పేరుతో సేవిస్తే మీ పాపాల‌ను తొల‌గిస్తాన‌ని భ‌గ‌వ‌ద్గీత‌లో పేర్కొన్నారు. హైందవి మార్ట్‌లు అందుకోసమే ఏర్పాటు చేశాం. వాటిని వ్యాపారం కోసం తెర‌వ‌డం లేదు. శిక్షణ పొందిన యువత రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు తెరిచారు'' అని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో ఒక వైపు హిజాబ్ వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు. హిజాబ్ కు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థలు, హిజాబ్ కావాల్సిందే అంటూ ముస్లింల డిమాండ్లతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న కర్నాటకలో ఇప్పుడు హలాల్, ఝట్కా ల సమస్య మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  4 Oct 2022 1:22 PM IST
Next Story