Telugu Global
National

కాంగ్రెస్ కు మ‌రో షాక్‌..స్టీరింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి ఆనంద్ శ‌ర్మ రాజీనామా

కా‍ంగ్రెస్ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శ‌ర్మ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. జ‌మ్ముక‌శ్మీర్ లో ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మించ‌డాన్ని స‌హించ‌లేక గులాంన‌బీ ఆజాద్ పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన రెండు రోజులకే ఆనంద్ శర్మ కూడా అదే బాటలో నడవడం కాంగ్రెస్ కు షాక్ తగిలిందనే చెప్పవచ్చు.

కాంగ్రెస్ కు మ‌రో షాక్‌..స్టీరింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి ఆనంద్ శ‌ర్మ రాజీనామా
X

కాంగ్రెస్ పార్టీకి మ‌రో సీనియ‌ర్ నేత షాకిచ్చారు. ఎఐసిసి పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్న త‌న‌ను జ‌మ్ముక‌శ్మీర్ లో ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మించ‌డాన్ని స‌హించ‌లేక గులాంన‌బీ ఆజాద్ పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శ‌ర్మ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆగస్టు 2020లో పార్టీ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)కి ఎన్నికలు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నాయకులలో ఆనంద‌శర్మ, ఆజాద్ ఇద్దరూ ఉన్నారు. ఈ బృందం జి-23'గా పిలిచేవారు.

హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాగ్రెస్ కోర్ గ్రూప్ నాయ‌కులు జ‌రిపిన చ‌ర్చ‌ల్లో, సంప్రదింపులలో తనను విస్మరించారని శర్మ ఎఐసిసి తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను ఆత్మ గౌర‌వం విష‌యంలో రాజీ ప‌డ‌లేన‌ని శ‌ర్మ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులకోసం ఎన్నిక‌ల్లో ప్రచారం చేస్తూనే ఉంటానని ఆయన సోనియా గాంధీకి చెప్పారు.

శర్మ రాజీనామాతో రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ‌!

కేంద్ర మాజీ మంత్రి , రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడు ఆనంద్ శ‌ర్మ ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్‌లో స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌ నాయకులలో ఒకరిగా ఉన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలో అధికార బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఆయన రాజీనామా వల్ల గండిపడే అవకాశం ఉంది.

1982లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ‌ర్మ‌కు 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చారు. అప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు.

First Published:  21 Aug 2022 6:19 PM IST
Next Story