Telugu Global
National

పిల్ల‌ల‌పై కోపంతో ఆస్తంతా ప్ర‌భుత్వానికి.. - ఓ వృద్ధుడి అనూహ్య నిర్ణ‌యం

నాథూసింగ్‌కి ఓ ఇల్లుతో పాటు స్థ‌లం కూడా ఉంది. వాటి విలువ రూ.1.50 కోట్లు ఉంటుంది. ఈ ఆస్తిని ప్ర‌భుత్వం పేరిట వీలునామా రాసిన నాథూసింగ్‌.. త‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆ స్థ‌లంలో ఆసుప‌త్రి, పాఠ‌శాల నిర్మించాల‌ని కోరారు.

పిల్ల‌ల‌పై కోపంతో ఆస్తంతా ప్ర‌భుత్వానికి.. - ఓ వృద్ధుడి అనూహ్య నిర్ణ‌యం
X

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌కు చెందిన ఓ వృద్ధుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న పేరిట ఉన్న కోటీ 50 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ఆస్తిని ప్ర‌భుత్వం పేరిట వీలునామా రాశారు. తాను చ‌నిపోయాక త‌న భౌతిక కాయాన్ని మెడిక‌ల్ కాలేజీకి అప్ప‌గించాల‌ని కోరారు.

ఆయ‌న పేరు నాథూసింగ్‌. వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం సొంత ఊళ్లోనే ఉన్న ఓ వృద్ధాశ్ర‌మంలో ఉన్నారు. ఆయ‌న‌కు ఒక కుమారుడు, న‌లుగురు కుమార్తెలు ఉన్నారు. వారంద‌రికీ పెళ్లీళ్ల‌య్యాయి. కుమారుడు స‌హ‌రాన్‌పూర్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు.

భార్య చ‌నిపోయిన త‌ర్వాత నాథూసింగ్ చాలాకాలం ఒంట‌రిగానే గ‌డిపారు. ఏడు నెల‌ల క్రితం ఆయ‌న వృద్ధాశ్ర‌మానికి మారారు. క‌నీసం త‌న‌ను చూడ‌టానికి కూడా త‌న‌వారెవ‌రూ రాక‌పోవ‌డంతో ఆయ‌న మ‌న‌సు విరిగిపోయింది. త‌న ఆస్తి మొత్తాన్ని ప్ర‌భుత్వం పేరిట రాయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

నాథూసింగ్‌కి ఓ ఇల్లుతో పాటు స్థ‌లం కూడా ఉంది. వాటి విలువ రూ.1.50 కోట్లు ఉంటుంది. ఈ ఆస్తిని ప్ర‌భుత్వం పేరిట వీలునామా రాసిన నాథూసింగ్‌.. త‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆ స్థ‌లంలో ఆసుప‌త్రి, పాఠ‌శాల నిర్మించాల‌ని కోరారు.

ఈ వ‌య‌సులో నేను నా కొడుకు, కోడ‌లితో ఉండాల్సింది. కానీ వాళ్లు న‌న్ను బాగా చూసుకోవ‌డం లేదు. అందుకే నా ఆస్తిని ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.. అని ఓ మీడియా సంస్థ‌కు ఆయ‌న వెల్ల‌డించారు. నాథూసింగ్ నుంచి త‌మ‌కు వీలునామాకు సంబంధించిన అఫిడ‌విట్ అందింద‌ని స్థానిక స‌బ్ రిజిస్ట్రార్ తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆ వీలునామా అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

First Published:  7 March 2023 4:11 AM GMT
Next Story