రైలు ప్రమాదంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.. - సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికను సుప్రీంకు అందజేసేలా చూడాలని కోరారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై విశ్రాంత న్యాయమూర్తితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్ యివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా మరణించగా, 1,100 మంది గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన నేపథ్యంలో రైల్వేలో రిస్క్ అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఈ కమిటీ ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికను సుప్రీంకు అందజేసేలా చూడాలని కోరారు.
బాధితుల తరలింపునకు ఉచిత బస్సులు..
ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధిక మంది పశ్చిమబెంగాల్ లోని సుందర్ బన్స్ ప్రాంతానికి చెందిన దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందినవారున్నారు. ఆయా బాధితులను కోల్‌కతా చేర్చేందుకు భువనేశ్వర్, కటక్, పూరి ప్రాంతాల నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్టు ఒడిశా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడి నుంచి కోల్‌కతాకు రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రయాణ ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి భరిస్తుందని ఒడిశా సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.
గాయపడినవారి వివరాలు 3 వెబ్‌సైట్‌లలో..
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి జాబితాను ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వెబ్‌సైట్‌లలో ప్రయాణికుల ఫొటోలు, ఇతర వివరాలను కూడా పొందు పర్చినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.