Telugu Global
National

బాలిక కేసులో సుప్రీంకోర్టు ‘అసాధారణ ’ తీర్పు

సాధారణంగా మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది.

బాలిక కేసులో సుప్రీంకోర్టు ‘అసాధారణ ’ తీర్పు
X

ఓ 14 ఏళ్ల బాలిక కేసును అసాధారణమైనదిగా పరిగణించిన సుప్రీంకోర్టు తన విస్తృతాధికారాలను ఉపయోగించుకొని తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. బాలిక తల్లికి ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఏప్రిల్‌ ప్రారంభంలో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గర్భవిచ్ఛిత్తికి నిరాకరిస్తూ ఏప్రిల్‌ 4న ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. బాలిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో ఉందని.. ఇప్పుడు విచ్ఛిత్తి చేస్తే పూర్తిగా రూపుదిద్దుకున్న పిండస్థ శిశువు జన్మించే అవకాశముందని ఈ సందర్భంగా న్యాయస్థానం తెలిపింది.

అయితే బాలిక తల్లి దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై గత వారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ముంబయిలోని సియాన్‌ ఆసుపత్రి మెడికల్‌ బోర్డును నివేదిక కోరింది. గర్భ విచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణయం వల్ల బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పాలని సూచించింది. దీనిపై మెడికల్‌ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ సమయంలో గర్భ విచ్ఛిత్తి చేస్తే కొంత ప్రమాదం ఉన్నప్పటికీ.. కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదని తన నివేదికలో పేర్కొంది. ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద ఉన్న విస్తృత అధికారాలతో ఈ తీర్పు వెలువరిస్తున్నట్టు తెలిపింది. ఆ బాలికకు తక్షణమే వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేయాలని సియాన్‌ ఆసుపత్రి డీన్‌ను ఆదేశించింది.

సాధారణంగా మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. తాజాగా సుప్రీంకోర్టు ఇది ‘అసాధారణ’ కేసుగా భావించి తీర్పు చెప్పడంతో బాలికకు ఊరట లభించినట్టయింది.

First Published:  22 April 2024 12:50 PM IST
Next Story