అజ్ఞాత దాత.. రూ.11 కోట్లు గుప్తదానం.. - చిన్నారి ప్రాణం కాపాడేందుకే..
పలువురు దాతల నుంచి ఆ చిన్నారి ఖాతాలోకి విరాళాలు రావడం మొదలైంది. అదే క్రమంలో సదరు అజ్ఞాత దాత రూ.11 కోట్ల మొత్తాన్ని చిన్నారి ఖాతాలోకి తన పేరు చెప్పకుండానే జమ చేశారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని కాపాడేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి రూ.11 కోట్లు గుప్తదానం చేశారు. తన పేరు తెలియకుండా నేరుగా చిన్నారి ఖాతాలోకి ఆ మొత్తాన్ని జమ చేశారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే.. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్, అతిథి దంపతుల కుమారుడు. పేరు నిర్వాణ్. వయసు 16 నెలలు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని కాపాడేందుకు దాత 11 కోట్ల రూపాయల మొత్తాన్ని దానం చేశారు.
ఇంతకీ ఆ వ్యాధి ఏమిటంటే.. నిర్వాణ్‌కు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2 అనే వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీని ప్రభావం వల్ల పుట్టిన 15 నెలల తర్వాత కూడా కాళ్లు కదపలేని స్థితిలో ఉన్నాడు. దీని నివారణకు రెండేళ్ల నిండకముందే కొన్ని రకాల ఔషధాలు వాడాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. అప్పుడే చికిత్సకు వీలవుతుందని స్పష్టం చేశారు. సంబంధిత మందులు అమెరికా నుంచి తెప్పించేందుకు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
అంత ఆర్థిక స్థోమత లేని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థించారు. దీంతో పలువురు దాతల నుంచి ఆ చిన్నారి ఖాతాలోకి విరాళాలు రావడం మొదలైంది. అదే క్రమంలో సదరు అజ్ఞాత దాత రూ.11 కోట్ల మొత్తాన్ని చిన్నారి ఖాతాలోకి తన పేరు చెప్పకుండానే జమ చేశారు. ఆ దాత సాయంతో సారంగ్ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు కొలిక్కి వచ్చినట్టయింది. ఇంకా రూ.80 లక్షలు సమకూరితే చిన్నారి వైద్యానికి డబ్బులు పూర్తిగా సమకూరుతాయని సమాచారం.