అమూల్ వర్సెస్ నందిని.. కర్నాటకలో పొలిటికల్ హీట్
నందిని బ్రాండ్ కర్నాటక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల సమాఖ్యకు చెందినది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నందిని సంస్థకు బెంగళూరు హోటళ్ల యజమానుల సంఘం తమ పూర్తి మద్దతు ప్రకటించింది.
కర్నాటకలో తమ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ సంస్థ ప్రకటించడం ఇప్పుడక్కడ పొలిటికల్ హీట్ రేపింది. ఇప్పటికే అక్కడ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకొని ఉండగా.. ఇదే సమయంలో తమ వ్యాపార విస్తరణలో భాగంగా బెంగళూరులో తమ పాల ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభిస్తామని అమూల్ సంస్థ ప్రకటించడం అక్కడి రాజకీయ వర్గాల్లో కాక రేపింది.
ఇప్పటికే స్థానికంగా నందిని సంస్థ కొనసాగుతుండగా.. ఇప్పుడు అక్కడ అడుగు పెడుతున్న అమూల్.. నందిని సంస్థను విలీనం చేసుకుంటుందనే వార్తలు బయటికొచ్చాయి. ఈ వ్యవహారంపై ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. స్థానికంగా ఉన్న నందిని సంస్థను గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నందిని బ్రాండ్ కర్నాటక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల సమాఖ్యకు చెందినది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నందిని సంస్థకు బెంగళూరు హోటళ్ల యజమానుల సంఘం తమ పూర్తి మద్దతు ప్రకటించింది. బెంగళూరులోని తమ హోటళ్లలో ఇకపై నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేసింది. కేఎంఎఫ్‌ను, రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావ్ ప్రకటించారు.
ఇకపై మంచి కాఫీ, స్నాక్స్ తయారీకి నందిని పాలను మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం అమూల్ సంస్థకు మింగుడుపడనిదిగా మారింది.