PUNJAB:వంద కార్లలో, ఏడు జిల్లాల పోలీసులు చేజ్ చేసినా దొరకని అమృత్‌పాల్ సింగ్
నిన్న పంజాబ్ జలంధర్‌లోని షాకోట్ తహసిల్‌కు అమృత్‌పాల్ తన కాన్వాయితో వెళుతుండగా ఏడు జిల్లాల పోలీసులు వంద కార్లలో ఆయన కాన్వాయ్ ని చేజ్ చేశారు. అమృత్ పాల్ సింగ్ అత్యంత చాకచక్యంగా కారులోంచి దిగి ఓ బైక్ ఎక్కి తప్పించుకున్నాడు.
ప్రత్యేక ఖాలిస్తాన్ దేశం మద్దతుదారుడు, 'వారిస్ దె పంజాబీ' ఛీఫ్ అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. నిన్న పంజాబ్ జలంధర్‌లోని షాకోట్ తహసిల్‌కు అమృత్‌పాల్ తన కాన్వాయితో వెళుతుండగా ఏడు జిల్లాల పోలీసులు వంద కార్లలో ఆయన కాన్వాయ్ ని చేజ్ చేశారు. అమృత్ పాల్ సింగ్ అత్యంత చాకచక్యంగా కారులోంచి దిగి ఓ బైక్ ఎక్కి తప్పించుకున్నాడు. అతని బైక్ ను కూడా చేజ్ చేసినప్పటికీ అమృత్ పాల్ దొరకలేదని పోలీసులు తెలిపారు.
అయితే ఆయన ప్రధాన అనుచరులు ఆరుగురితోపాటు మరో 78 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, అమృత్ పాల్ గన్ మెన్లను కూడా ఆయుధాలతో సహా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఇంటర్నెట్ బంద్ చేశారు.
కాగా, అమృత్ పాల్ సింగ్ మద్దతుదారుడు లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తుఫాన్ సింగ్‌ను ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆయనను విడుదల చేయాలంటూ ఫిబ్రవరి 23న వేలాదిమంది అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు తల్వార్లు, కర్రలతో అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి లవ్‌ప్రీత్ సింగ్ ను విడిపించుకవెళ్ళారు. అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ పై కన్నేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి పక్కా ప్రణాళిక వేశారు. నిన్న ప్రణాళిక ఫెయిల్ అయినప్పటికీ త్వరలోనే ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
అయితే నిన్న సాయంత్రం అమృత్ పాల్ సింగ్ అరెస్టయినట్టు పోలీసులను ఉటంకిస్తూ జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆయన అరెస్టు తర్వాత పంజాబ్ లో ఆయన అనుచరులు విధ్వంసం సృష్టిస్తారనే అనుమానంతోనే ఇంటర్నెట్ ఆపేశారన్న వార్తలను కూడా ప్రచారం చేశారు. అయితే అమృత్ పాల్ తప్పించుకున్నాడని నిన్న రాత్రి పోలీసులు ప్రకటించారు.