వ్యక్తిగత హక్కులను కాపాడాలని ఢిల్లీ హైకోర్టులో అమితాబ్ దావా - మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన జస్టిస్ నవీన్ చావ్లా
కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి)ని పోలిన వాణిజ్య కార్యకలాపాలకు మొబైల్ అప్లికేషన్ డెవలపర్‌లు, లాటరీలు నిర్వహించడానికి బచ్చన్ పేరు, ఫొటో, వాయిస్‌ని ఉపయోగిస్తున్నారు. దీనిపై బచ్చన్ కోర్టులో దావా వేశారు.
తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. తన అనుమతి, ఆమోదం లేకుండా తన ఫొటోకానీ, పేరుకానీ, గొంతుకానీ, హావభావాలుకానీ వాడుకుని వాణిజ్యపరంగా లబ్ధి పొందడాన్నిఅరికట్టేందుకు చట్టపరంగా రక్షణ కల్పించాలని అమితాబ్ హైకోర్టును అభ్యర్థించారు. బచ్చన్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే ఈ కేసును వాదించారు.
అమితాబ్ బచ్చన్ వ్యక్తిత్వాన్ని, ప్రచార హక్కులను ఎవరూ ఉల్లంఘించడానికి వీలులేదని, ఇలాంటి చర్యలను నిషేధిస్తూ జస్టిస్ నవీన్ చావ్లా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ నటుడు, సెలబ్రిటీ హోదాను కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండానే తమ సొంత వ్యాపారాలను ప్రచారం చేసుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలు ఉపయోగించుకుంటున్నాయని తన తీర్పులో జస్టిస్ చావ్లా పేర్కొన్నారు. దీనివల్ల వాది అయిన అమితాబ్ తీవ్ర నష్టాన్ని, పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉందని, కొన్ని కార్యకలాపాలు అతనికి చెడ్డపేరును కూడా తీసుకురావచ్చని జస్టిస్ అభిప్రాయపడ్డారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తున్నట్లు అని జస్టిస్ చావ్లా పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్ సుప్రసిద్ధ వ్యక్తి, అతను వివిధ వాణిజ్య ప్రకటనలకు బ్రాండెగా ఉంటున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి)ని పోలిన వాణిజ్య కార్యకలాపాలకు మొబైల్ అప్లికేషన్ డెవలపర్‌లు, లాటరీలు నిర్వహించడానికి బచ్చన్ పేరు, ఫొటో, వాయిస్‌ని ఉపయోగిస్తున్నారు. దీనిపై బచ్చన్ కోర్టులో దావా వేశారు. అంతేకాదు, తన పేరుతో చెలామణి అవుతున్న పుస్తక ప్రచురణలు, టీ-షర్ట్ విక్రేతలు, ఇంకా అనేక ఇతర వ్యాపారాలపై నిషేధం విధించాలని బచ్చన్ కోరారు. దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిషేధం విధించారు. ఈ అంశంపై వచ్చే ఏడాది మార్చిలో విచారణ జరగనుంది.